Chenetha Mitra | నమస్తే తెలంగాణ నెట్వర్క్ ;‘చేనేత మిత్ర’ ద్వారా ప్రతి మగ్గం కార్మికుడి బ్యాంకు ఖాతాలో నెలకు రూ.3 వేలు పడుతుండటంతో చేనేత కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 32 వేల చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరుతున్నదని సంబురపడుతున్నారు. గతంలో ఏ సర్కారూ తమ బతుకులను పట్టించుకున్న పాపాన పోలేదని, సీఎం కేసీఆర్ వచ్చినంకనే చేనేత జీవితాల్లో కొత్త కాంతులు వచ్చాయని చెప్తున్నారు. మగ్గం కదిలితే గానీ, కడుపు నిండని తమకు కేసీఆరే దేవుడని అంటున్నారు. చేనేత కార్మికుల ఆనందం వారి మాటల్లోనే..
పేద కార్మికులకు పెద్ద చేయూత
నెలనెలా డబ్బులు పెట్టి నేత సరుకులు కొనాలంటే ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యేవి. చేనేత మిత్ర కింద సబ్సిడీ రూపంగా డబ్బులు అందజేస్తుండటంతో ఆ సమస్య తీరుతుంది. మా కొనుగోలు శక్తి పెరుగుతుంది. దీంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. ఇది పేద కార్మికులకు కష్టకాలంలో పెద్ద చేయూతగా మారింది. నా భర్త మరణించినప్పుడు నాకు ప్రభుత్వం అందజేసిన చేనేత బీమా మనోధైర్యాన్ని ఇచ్చింది. దాంతో నా కుటుంబం ఆర్థికంగా నిలబడింది.
– కొంగరి కళావతి, నేత కార్మికురాలు, చిట్యాల, నల్లగొండ జిల్లా
కేటీఆర్ సారుతోని చేనేతకు మంచిరోజులొచ్చినయ్
నా పేరు కోట కనకయ్య. మాది జమ్మికుంట మండలం పొత్కపల్లి. కొంత కాలం మహారాష్ట్రలోని సోలాపూర్‌లో మగ్గం నేసిన. అక్కడ సరిగా పనిలేక లేక చాన్నాళ్ల కింద సిరిసిల్లకు వచ్చిన. ఇక్కడే మహేశ్వర సంఘంలో మగ్గం పని సేత్తున్న. నాటి సర్కారు చేనేతను పట్టించుకోలేదు. తెలంగాణ సర్కారొచ్చినంక మంత్రి కేటీఆర్ సార్ పుణ్యమా అని చేనేతకు మంచిరోజులచ్చినయ్. రంగులకు, నూలుకు సబ్సిడీ ఇచ్చిండు. చేసుకున్న కూలీలో కొంత దాసుకునేందుకు త్రిఫ్ట్ పథకం తెచ్చిండు. నాకు 75 ఏండ్లు దాటినా పొట్ట కోసం ఇంకా మగ్గం నేత్తున్నా. కేసీఆర్ సారు నెలకు రూ.2వేల పింఛను ఇత్తుండు. రేషన్‌లో బియ్యం వత్తున్నయ్. ఇన్నేండ్లు నేత కార్మికుడు సచ్చిపోతే పోయిన సర్కారు బుడ్డపైస ఇయ్యలే. మా రామన్న రూ.5 లక్షల బీమా సౌలతు చేసిండు. ఇప్పటికే నలుగురైదుగురు సచ్చిపోతే వాళ్ల కుటుంబానికి రూ.5 లక్షలు ఇచ్చిండ్రు. ఇప్పుడు చేనేత మిత్ర పథకంలో రూ.3 వేలు నెలకు మా ఖాతాలో జమ అయితున్నందుకు సంతోషంగా ఉన్నది. వచ్చే ఎలచ్చన్ల కేటీఆర్, కేసీఆర్ సార్లను గెలిపించుకుంటం.
– కోట కనకయ్య, సిరిసిల్ల
గొప్ప జీవనోపాధి దక్కుతున్నది
సమైక్య పాలనలో ఆదరణకు నోచుకోని చేనేత రంగాన్ని, నేత కార్మికుల కష్టనష్టాలను అప్పుడు కేటీఆర్ సార్ దగ్గరుండి చూసిన్రు. స్వరాష్ట్రంలో చేనేత, జౌళి శాఖ మంత్రి అయినంక అనేక రకాలుగా ఆదుకుంటుండటంతో చేనేత కుటుంబాలు గొప్పగా జీవనోపాధి పొందుతున్నయి. పని లేక ఇబ్బందులు పడుతున్న కార్మికులను గుర్తించి ఉపాధి లభించేలా చేసిన్రు. ఆయన వల్లే చేనేత మగ్గాలకు, కార్మికులకు మంచి రోజులు వచ్చినయ్. చేనేత కుటుంబాలు సంతోషంగా ఉన్నయ్. మగ్గాలు నేసే వారందరికీ తెలంగాణ సర్కారు రూ.2,016 పింఛన్ ఇస్తున్నది. బీమా సౌకర్యం కల్పించింది. ఇప్పుడు నెలకు రూ.3,000 ఖాతాలో వేస్తున్నది. గతంలో కుటుంబాలు గడుస్తయో లేదో అనుకుని చాలీచాలని కూలీతో ఆర్థిక ఇబ్బందులు పడేవాళ్లం. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ సార్లే చేనేతకు పెద్దదికుగా మారిండ్రు.
-వల్లకట్ల నారాయణ, చేనేత కార్మికుడు, రంగాపూర్,చేనేత సహకార సంఘం హుజూరాబాద్, కరీంనగర్ జిల్లా
వృత్తిని కాపాడారు
తెలంగాణ ప్రభుత్వం రాక ముందు చేనేత కార్మికుల పరిస్థితి దారుణంగా ఉండేది. నూలు రేటు పెరిగితే వస్త్రం ధర పెరుగకుండె. వస్ర్తానికి సరిగా మార్కెట్ లేక శావుకారి కూలి ఇచ్చేవారు కాదు. చేనేత కార్మికుల బతుకులు చాలా దయనీయంగా ఉండేవి. చాలా మంది కుటుంబం గడవక ఈ వృత్తిని వదిలి వేరే పనులు చేసుకున్నారు. ఇప్పుడు తిరిగి వృత్తిలోకి వస్తున్నారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వృత్తిదారులకు ప్రత్యేకంగా పథకాలు ప్రవేశపెట్టి అన్ని విధాలుగా అండగా ఉంటున్నారు. చేనేత కార్మికుడై ఉంటే చాలు.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం కార్మికులందరికీ నేరుగా అందుతున్నది.
-గోషిక పూర్ణచందర్, చౌటుప్పల్, యాదాద్రి జిల్లా
సీఎం కేసీఆర్ చెయ్యవట్టే బతికి బట్టకట్టినం
గత ప్రభుత్వాలు చేనేత కార్మికులను అస్సలు పట్టించుకోలేదు. మొత్తం చేనేత రంగం కుదేలైంది. తెలంగాణ సర్కారు వచ్చినంక సీఎం కేసీఆర్ జెయ్యవట్టే చేనేత కార్మికులం బతికి బట్టకట్టినం. చేనేత మిత్ర పథకం అమలు చేసి ఖాతాలో రూ.3 వేలు వేస్తున్నందుకు నిజంగానే సీఎం కేసీఆర్ చేనేతకు మిత్రుని లెక్క నిలిచిండు. 50 ఏండ్లు నిండిన ప్రతి కార్మికుడికి రూ.2016 పింఛన్, రైతుబీమా మాదిరి రూ.5 లక్షల బీమాతో భరోసానిస్తున్నడు. ఇన్ని యోగక్షేమాలు చూసుకుంటున్న సీఎం కేసీఆర్ సార్‌తోనే చేనేత రంగానికి మనుగడ ఉంటుంది.
-సామల శ్రీనివాస్, చేనేత కార్మికుడు, చల్లగరిగె, చిట్యాల మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
నేతన్నకు మంచి రోజులు
సీఎం కేసీఆర్ పాలనలో నేతన్నకు మంచిరోజులు వచ్చాయని అంటున్నారు జోగులాంబ గద్వాల జిల్లా రాజోళికి చెందిన శిరీషాబాయి. ఉమ్మడి పాలనలో చేనేతకు ఆదరణ లేక వృత్తిని విడిచిపోయామని, ఇప్పుడు తమ వృత్తికి పూర్వ వైభవం వచ్చిందని ఆమె సంతోషంతో చెప్పారు. ‘తెలంగాణ ఏర్పడ్డాక కేటీఆర్ జౌళి శాఖ మంత్రి అయ్యాక చేనేతకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు. మమ్ములను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలు అమలు చేశారు. నాడు నెలకు రూ.10 నుంచి రూ.15 వేల ఆదాయం ఉండేది. నేడు రూ.20 నుంచి రూ.25 వేల వరకు సమకూరుతున్నది. చేనేతను ప్రభుత్వం మంచి స్థాయిలో ప్రచారం చేసింది. ఆదిరించిన మంత్రి కేటీఆర్ సారుకు ధన్యవాదాలు’ అని వెల్లడించారు.
కేసీఆర్ దేవుడిలా వచ్చి ఆదుకున్నారు
పద్మశాలి కుటుంబంలో పుట్టిన జనగామ జిల్లా ఆలేరుకు చెందిన పెనుగొండ శ్రీహరి 20 ఏండ్ల కిందట సిరిసిల్లకు వచ్చారు. రాజీవ్‌నగర్‌లోని మహేశ్వర చేనేత సంఘంలో పనిచేస్తున్నారు. ఆయన భార్య నాగమణి బీడీలు చుడుతూ బతుకు బండిని లాగుతున్నారు. ఆయన కుమారుడు కూడా సాంచెల పనే చేస్తారు. నెలంతా కష్టపడ్డా రూ.2 వేలు రాకపోయేది. ‘దేవుడిలా వచ్చిన సీఎం కేసీఆర్ నెలకు రూ.2,016 పెన్షన్ ఇచ్చారని, త్రిఫ్ట్ పథకం పెట్టి పొదుపు చేసుకుంటే సగం పైసలు కేసీఆరే ఇస్తున్నారని వెల్లడించారు. ఇప్పుడు చేనేత మిత్ర పథకం కింద నెలకు రూ.3 వేలు తమ ఖాతాల్లో వేస్తున్నారని సంబురపడ్డారు. సార్ మంచిగుండాలని రోజూ దేవుడికి దండం పెట్టుకుంటున్నాం’ అని గొండ శ్రీహరి పేర్కొన్నారు.
‘చేనేత మిత్ర’తో గిట్టుబాటు ధర
నా పేరు పడాల యాదగిరి. మాది జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం శివునిపల్లి. నా వయసు 68 ఏండ్లు. నాకు ముగ్గురు కూతుళ్లు. అందరికీ వివాహమైంది. నేను ఎనిమిది వరకు చదివాను. 17 ఏండ్ల నుంచి మగ్గం నేస్తున్నా. ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల, మహారాష్ట్రలోని భీవండిలో చేనేత కార్మికుడిగా పనిచేసిన. మా గ్రామంలోని చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం లిమిటెడ్ సొసైటీలో 38 ఏండ్లుగా గుంట మగ్గం నేస్తూ జీవనం సాగిస్తున్నా. నా భార్య భాగ్యమ్మ కండెలు చుడుతూ నాకు సహకరిస్తుంది. నేను ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మగ్గంపైనే పనిచేస్తా. మూడు రోజులకు రెండు చీరలు నేస్తా. నెలకు రూ.15 వేల వరకు సంపాదిస్తా. గతంలో నేను ముడి సరుకు, రంగులు ఉద్దెరకు తెచ్చుకునేది. ఉద్దెర కాబట్టి అధిక ధరలకు ఇవ్వడంతో గిట్టుబాటు ధర తక్కువగా వచ్చేది. కానీ తెలంగాణ ప్రభుత్వం చేనేత మిత్ర పథకం ద్వారా కార్మికులకు జియో ట్యాగ్ ఇచ్చింది. పురుషులకు రూ.2 వేలు, కండెలు చుట్టే స్త్రీలకు నెలకు వెయ్యి రూపాయలు అందిస్తున్నది. వీటితో ముడి సరుకు, రంగులు నగదు చెల్లించి తెచ్చుకుంటున్నా. అరువుపై కాకుండా నగదు చెల్లించి తెచ్చుకోవడం ద్వారా మరింత ఆదాయం వస్తున్నది. మాకు ఈ వృత్తిపై గౌరవం పెరిగేలా చేసి, మాలో ధైర్యం నింపిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ఈ ప్రభుత్వానికి మేం ఎప్పుడూ అండగా ఉంటాం.
-పడాల యాదగిరి, చేనేత కార్మికుడు, శివునిపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్(జనగామ జిల్లా)