CM Revanth Reddy | హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): నేతన్నలు ఎనిమిది నెలలుగా చేస్తున్న పోరాటంతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. చేనేత రుణాలను మాఫీ చేయడంతోపాటు త్రిఫ్టు పథకం కింద రావాల్సిన రూ.290 కోట్ల బకాయిలను విడుదల చేసింది. రాష్ట్రంలో రూ. 30 కోట్ల చేనేత రుణాలు మాఫీ చేసి నేత కార్మికులను రుణవిముక్తులను చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లోని లలితా కళాతోరణంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టీ)ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో ఐఐహెచ్టీ లేకపోవడంతో మనరాష్ట్ర విద్యార్థులు ఏపీ, ఒడిశాకు వెళ్లాల్సివస్తున్నదని అన్నారు. ఈ ఆంశం తన దృష్టికి వచ్చిన వెంటనే ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. కేంద్రం సైతం వెంటనే సానూకూలంగా స్పందించి ఐఐహెచ్టీ ఏర్పాటుకు ఆమోదం తెలిపిందన్నారు. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీలో ఐఐహెచ్టీ భవనం ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ఐఐహెచ్టీకి తెలంగాణ కోసం పదవులను తృణప్రాయంగా వదిలేసిన కొండాలక్ష్మణ్బాఫూజీ పేరు పేడతామని ప్రకటించారు. నేత కార్మికుల కండ్లల్లో ఆనందం నింపేలక్ష్యంతో రూ. 290 కోట్ల బతుకమ్మ చీరల బకాయిలను విడుదల చేశామని గుర్తుచేశారు. రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు ఏడాదికి రెండు చొప్పున నాణ్యమైన చీరెలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించి ఏడాదికి కోటి 30 లక్షల చీరెల ఆర్డర్లను నేతకార్మికులకు ఇచ్చి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత పనిలేక, కుటుంబ పోషణ భారమై రాష్ట్రవ్యాప్తంగా 12 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. తమను ఆదుకోవాలని ఆసాములు, కార్మికులు, యజమానులు ఒక్కటై జేఏసీగా ఏర్పడి సర్కారుపై పోరు ప్రారంభించారు. జూలై, ఆగస్టు నెలల్లో నిరసన దీక్షలు చేపట్టారు. ఎనిమిది నెలలుగా అలుపెరుగని పోరా టం చేయడంతో దిగొచ్చిన సర్కారు ఎట్టకేలకు నేతన్నల రుణాలు మాఫీ చేయడంతోపాటు, బకాయిలు విడుదల చేయడమే కాకుండా వారికి పని కల్పించడానికి కూడా ముందుకొచ్చింది.