ఖైరతాబాద్, డిసెంబర్ 22: ప్రభుత్వం ప్రకటించిన రూ.33 కోట్ల చేనేత రుణమాఫీ నిధులను వెంటనే విడుదల చేయాలని పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు అయినా చేనేతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని చెప్పారు.
పద్మశాలీ, హ్యాండ్లూమ్, టెక్స్టైల్ కార్పొరేషన్లకు ఇతర సామాజికవర్గానికి చెందిన వారిని చైర్మన్లుగా నియమించే ప్రయత్నం జరుగుతుందని విమర్శించారు. కార్పొరేషన్ల బాధ్యతలను పద్మశాలీలకే అప్పగించాలని డిమాండ్ చేశారు.
రైతు బంధు తరహాలో చేనేత బంధును ఏర్పాటు చేసి ఆర్థిక చేయూత నివ్వాలని డిమాండ్ చేశారు. చేనేత సహకార సంఘానికి వెంటనే ఎన్నికలను నిర్వహించాలని కోరారు. విలేకరుల సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షుడు వేముల బాలరాజు, రాజకీయ విభాగం చైర్మన్ గుంటి నగేశ్, ప్రధాన కార్యదర్శి అప్పం శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు గుంటక మహేశ్, వనమాల శంకర్, కోశాధికారి బింగి నవీన్, గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ పాశికంటి మల్లేశ్, రాష్ట్ర కార్యదర్శులు బొమ్మిడాల లక్ష్మణ్, మాధవి, మారుతి, వంగరి విష్ణు, సత్యప్రకాశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.