హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత, హనుమకొండ మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి (Jangareddy) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నగరంలోని ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందారు. జంగారెడ్డి స్వస్థలం వరంగల్ జిల్లా పరకాల. ఉదయం 9.30 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఆయన పార్ధివదేహాన్ని తరలించనున్నారు.
1935లో పరకాలలో జంగారెడ్డి జన్మించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యే, ఎంపీగా సేవలు అందించారు. 1984లో ఎనిమిదో లోక్సభకు హనుమకొండ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో పీవీ నరసింహారావుపై విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలుపొందిన ఇద్దరు ఎంపీల్లో జంగారెడ్డి ఒకరు. అదే ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలుపొందిన మరో వ్యక్తి వాజ్పేయి.
జంగారెడ్డి మృతిపట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంతాపం తెలిపారు. ఆయన మరణం బీజేపీకి తీరని లోటని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.