హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : పంచాయతీరాజ్‌శాఖకు సంబంధించి హైబ్రిడ్ యాన్యుయిటీ మోడ్(హ్యామ్) ప్రాజెక్టుల కోసం టెండర్ నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానున్నది. ఈ మేరకు పంచాయతీరాజ్ ఇంజినీర్-ఇన్-చీఫ్ జోగారెడ్డి ఏర్పాట్లు పూర్తిచేశారు. మూడు దశల్లో చేపట్టే ఈ ప్రాజెక్టు.. ఫేజ్-1 కోసం టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీని పూర్తి చేశారు. ప్రాజెక్ట్ మొత్తం అంచనా వ్యయం రూ. 6,294.81 కోట్లు కాగా, ఫేజ్-1 టెండర్ల ప్రక్రియకు ఆర్థిక అనుమతి మంజూరైంది.
ఫేజ్-1లో 17 ప్యాకేజీల కింద 96 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2,162 రహదారులు (7,449.50 కి.మీ పొడవుతో) నిర్మించనున్నారు. టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభమవుతాయని బుధవారం మంత్రి సీతక్క తెలిపారు. ప్రాజెక్ట్ వ్యయానికి నిర్మాణ దశలో 40% ప్రభుత్వమే చెల్లిస్తుంది. మిగిలిన 60% మొత్తాన్ని కాంట్రాక్టర్లు బ్యాంకుల ద్వారా సమీకరిస్తారు. రహదారుల నిర్మాణం పూర్తయిన తర్వాత 15 ఏండ్లపాటు నిర్వహణ బాధ్యత కూడా కాంట్రాక్టర్లదే అవుతుంది.