నల్లగొండ : ప్రధాన మంత్రి మోదీ హన్మకొండ సభలో పచ్చి అపద్దలను మాట్లాడారు. ప్రధానమంత్రి హోదాలో ఉండి అసత్యాలు ప్రచారం చేయడం సబబు కాదు. ప్రధానమంత్రి హోదాను ఆయన దిగజార్చారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. మోదీ విభజన హామీలో ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ హామీని తుంగలో తొక్కి, రైల్వే రిపేర్ షెడ్ కి ప్రారంభోత్సవం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కేవలం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేసి బురద చల్లడానికే మోదీ ఢిల్లీ నుంచి వచ్చారు. ప్రధానమంత్రి హోదాలో రాష్టానికి వచ్చిన మోదీ అసలు ఈ రాష్టానికి ఏం చేశాం, ఏం చేయబోతున్నాం అని చెప్పలేక కేసీఆర్పై అవినీతి ఆరోపణలు చేయడం దారుణమన్నారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం పురోగతి సాధిస్తుంటే మోదీ పాలనలో దేశం తిరోగమనంలో పయనిస్తున్న విమర్శించారు. దేశ జిడిపి రేట్ గణనీయంగా తగ్గింది. రూపాయి విలువ తగ్గింది. కేసీఆర్ పైన ఆరోపణలు చేసిన మోదీనే అవినీతికి ఆధ్యుడని ఆరోపించారు. దేశంలో అదాని చేస్తున్న అవినీతిలో ప్రధానమంత్రి మోదీ హస్తం ఉందన్నారు.
ఆయన సన్నిహితులు కాబట్టే మోసకారులకు 12 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేయించారని గుర్తు చేశారు. కేసీఆర్ పైన, ఆయన కుటుంబ సభ్యులపైన అవినీతి ఆరోపణలు చేయడం సూర్యునిపై ఉమ్మడం లాంటిదేనని పేర్కొన్నారు.
బిజిపి ప్రభుత్వంలో దేశంలో ప్రజాస్వామ్యం కూని అవుతోంది .సామాన్యులు నివసించలేని విధంగా నిత్యవసర ధరలు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు ,కుతంత్రాలు చేసిన బిజెపి పార్టీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మరు. బిజెపి చేసే తప్పుడు ఆరోపణలకు తగిన సమయంలో ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పాల్గొన్నారు.