హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : గోవాలో ఈ నెల 20 నుంచి 28 వరకు నిర్వహించనున్న 56వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ)లో గిరిజన నృత్యం గుస్సాడీని ప్రదర్శించనున్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా ఈ నెల 20న తెలంగాణ గోండు గిరిజన కళాకారులు గుస్సాడీ నృత్యంతో అలరించనున్నారు.
ఈ కళాకారులు గోవాలోని తాజ్ సిద్డాడే హోటల్, కళా అకాడమీ, శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియం, ఐనాక్స్, ఇతర ప్రదేశాలతో పాటు ఐఎఫ్ఎఫ్ఐ వేదికపైనా ప్రదర్శనలు ఇవ్వనున్నారు. కళాకారులు కనక సుదర్శన్, సాయిరాజ్, జే సంజయ్ కుమార్, అత్రం దేవురావ్, సోమరమేశ్, యర్మ హనుమంతు, బోవన్రావ్ పాల్గొననున్నారు.