హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : నచ్చివాళ్లకు ఒకరకంగా, నచ్చనివాళ్లకు మరోరకంగా పోస్టింగ్‌లు ఇవ్వడం ఎస్సీ గురుకుల సొసైటీలో పరిపాటిగా మారింది. ఇదేమని నిలదీసిన ఓ మహిళా ఉద్యోగిని ‘ఎవరికి చెప్పుకొంటావో చెప్పుకో’ అంటూ ఓ ఉన్నతాధికారి దబాయించడం వివాదాస్పదంగా మారింది. దొడ్డదారిలో సొసైటీలో కీలకస్థానంలో పాగా వేసిన సదరు అధికారి ప్రస్తుతం పెత్తనం చెలాయించడంపై ఉద్యోగులు రగిలిపోతున్నారు.
సొసైటీలో వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న పలువురు ప్రిన్సిపాల్స్, ఉద్యోగులు, ఉపాధ్యాయులు వివిధ కారణాల నేపథ్యంలో సస్పెన్షన్‌కు గురయ్యారు. సుదీర్ఘకాలం తరువాత విచారణ కొనసాగుతున్న తరుణంలో ప్రభుత్వం వారిని మళ్లీ విధుల్లోకి తీసుకున్నది. వీరికి పోస్టింగ్‌లు ఇచ్చే తరుణంలో ఓ ఉన్నతాధికారి ఇష్టారీతిన వ్యవహరించారనేది సొసైటీలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సస్పెండ్ అయిన అధికారులకు తిరిగి అదే స్థానంలో కానీ, అదే జిల్లాలో కానీ పోస్టింగ్ ఇవ్వరు. కానీ, సొసైటీలో ఇటీవల పలువురికి గతంలో ఎక్కడైతే సస్పెన్షన్‌కు గురయ్యారో అక్కడే మళ్లీ పోస్టింగ్ ఇచ్చారు. పలువురికి సమీప ప్రాంతంలో కోరుకున్న చోట పోస్టింగ్ ఇచ్చారు. చాలామందికి వేర్వేరు సుదూరప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చారు. సస్పెన్షన్‌కు గురైన ఓ ప్రిన్సిపాల్ ఇదే విషయంపై ప్రశ్నించగా.. ‘ఎవరికి చెప్పుకొంటావో చెప్పుకో. చేసేదేమీ లేదు. పోస్టింగ్ ఇచ్చిన చోటుకు వెళ్లాల్సిందే’ అంటూ ఓ ఉన్నతాధికారి దబాయించడం సొసైటీలో చర్చనీయాంశంగా మారింది. అయితే నచ్చినవాళ్లకు, పైరవీలు చేసినవాళ్లకు కోరుకున్న చోట, నచ్చనివాళ్లకు ఇష్టారీతిన పోస్టింగ్‌లు ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సొసైటీ ప్రధాన కార్యాలయంలోని సదరు ఉన్నతాధికారిపై మొదటినుంచీ అనేక ఆరోపణలున్నాయి. నిబంధనలకు, సొసైటీ స్టాండింగ్ ఆర్డర్స్‌కు విరుద్ధంగా ప్రమోషన్ పొందారు. సమాచార హక్కు చట్టం ద్వారా గతంలోనే పెద్దపల్లి జిల్లాకు చెందిన ఒకరు ఈ విషయాన్ని బయటపెట్టారు. తన సమీప బంధువుల కోసమే ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా గతంలో బదిలీల మార్గదర్శకాలను మార్చారని సొసైటీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. తాజాగా చేపడుతున్న బదిలీల ప్రక్రియలోనూ సదరు అధికారి అనేక అక్రమాలకు తెరలేపారని వివరిస్తున్నారు. సదరు అధికారిపై శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు ఉద్యోగ, ఉపాధ్యాయులు అనేక పర్యాయాలు ఫిర్యాదులు చేశారు. బదిలీల ప్రక్రియ నుంచి తప్పించాలని వేడుకున్నారు. సదరు అధికారి ప్రమోషన్ పొందిన తీరు, ఆ తరువాత ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయింది. అనేక ఆరోపణలు, వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్న అధికారికే తాజాగా అదనంగా మరిన్ని కీలక బాధ్యతలు ప్రభుత్వం అప్పగించడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.