హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): గురుకుల విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీఎస్‌యూటీఎఫ్-గురుకుల టీచర్ల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ధ ‘మహాధర్నా’ నిర్వహించనున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, సెక్రటరీ చావ రవి ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యలు పరిష్కరించేదాకా ఉద్యమిస్తామని వారు తెలిపారు. గత కొన్నిరోజులుగా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలకు కొనసాగిస్తున్నామని, దానికి కొనసాగింపుగా ఈ మహాధర్నా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో 3,664కు పైగా యూపీఎస్ పాఠశాలల విలీనం పేరుతో మూసివేయాలని ప్రతిపాదనలతో పేద విద్యార్థులు నష్టపోతారని తెలిపారు. ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఇంటర్ విద్యను రద్దుచేసి దాని స్థానంలో నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం చేసిన ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీలు కోదండరాం, తీన్మార్ మల్లన్న, ప్రొఫెసర్ నాగేశ్వర్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొనున్నట్టు తెలిపారు. ఈ ధర్నాకు పెద్ద సంఖ్యలో గురుకుల టీచర్లు పాల్గొంటారని వారు పేర్కొన్నారు.