హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 1,022 గురుకులాల్లో నెలకొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, నాన్‌టీచింగ్ సమస్యల పరిష్కారం కోసం టీచర్లు గత రెండు వారాలుగా వివిధ పద్ధతుల్లో పోరాటాలు చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యాసంస్థలకు దసరా సెలవులు రావడంతో ప్రస్తుతం తమ పోరాటాలకు తాత్కాలిక బ్రేక్ వేసినట్టు గురుకుల టీచర్ల జేఏసీ తరఫున టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు జంగయ్య, చావి రవి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా త గురుకులాల్లో సమస్యలు పెరిగిపోయాయని, వాటి పరిష్కారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టి పెట్టకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. గురుకుల్లా లో కొత్త టైంటేబుల్ అమలు, అద్దె భవనాల్లో గురుకులాల కొనసాగింపు తదితర సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. దసరా సెలవుల తర్వాత ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.