KCR | హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): సకల రంగాల్లో బహుజనులను కట్టడిచేసే సామాజిక, సంప్రదాయ నిర్భందాలను బద్దలుకొట్టి స్త్రీ విద్య కోసం తన జీవితాన్ని ధారపోసిన మహనీయురాలు సావిత్రీబాయి ఫూలే అని బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు కొనియాడారు. చదువులతల్లి సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చేసిన సామాజిక కృషిని గుర్తుచేసుకున్నారు. స్త్రీ జాతి ఔన్నత్యం కోసం, అణచివేతకు గురైన కులాల స్వేచ్ఛ కోసం మహాత్మా జ్యోతారావు ఫూలే, సావిత్రీబాయి ఫూలే దంపతులు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా, మెజారిటీ ప్రజల జీవన విధానం మరింత గుణాత్మకంగా మార్పు చెందడానికి, వారి హకులను కాపాడేందుకు, త్యాగాలు చేసిన భారతీయ మహనీయుల్లో ఫూలే దంపతులు ముందు వరుసలో ఉంటారని కొనియాడారు. సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో దళిత, బహుజన వర్గాలను మరింత భాగస్వామ్యం చేసే దిశగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పదేండ్ల అనతికాలంలో కుదురుకున్నదని తెలిపారు. మహాత్మా ఫూలే దంపతుల ఆశయాలకు అనుగుణంగా చేపట్టిన నాటి బీఆర్ఎస్ కార్యాచరణ నేడు ఫలితాలు ఇస్తున్నదని గుర్తుచేశారు. దళిత, బహుజన వర్గాలకు పట్టుకొమ్మలైన పల్లె తెలంగాణ నేడు ప్రగతిపథంలో పయనిస్తూ భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేసిందని వివరించారు.
గురుకుల విద్యతో సహా బడుగు వర్గాల బిడ్డలను భావితరాలకు ప్రతినిధులుగా తీర్చిదిద్దాలనే దార్శనికతతో విద్యారంగంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన పునాదిలో సావిత్రీబాయి ఫూలే దంపతుల ఆశయాలు ఇమిడి ఉన్నాయని కేసీఆర్ స్పష్టంచేశారు. తెలంగాణ ఆడబిడ్డలకు ప్రపంచస్థాయి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేవడానికి ప్రత్యేక గురుకులాలు, జూనియర్, డిగ్రీ కళాశాలలను స్థాపించామని గుర్తుచేశారు. మహిళా సాధికారత కోసం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిందని వివరించారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ సబ్బండ వర్గాల్లో నిత్య చైతన్యాన్ని నింపడమే సావిత్రీబాయి ఫూలే వంటి మహనీయులకు మనం అందించే ఘన నివాళి అని కేసీఆర్ పేర్కొన్నారు.