హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ) : లైబ్రేరియన్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్లను డిప్యూటీ వార్డెన్ డ్యూటీల నుంచి మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వ గురుకుల ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ సెక్రటరీ సైదులును కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య మాట్లాడుతూ.. బీసీ గురుకులాల్లో పనిచేస్తున్న ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్లతోపాటు లైబ్రేరియన్లకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి డిప్యూటీ వార్డెన్ డ్యూటీని కేటాయించాలని సొసైటీ నిర్ణయించడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు.
గతంలో ఇదే సొసైటీలో పనిచేస్తున్న ఉద్యోగులకు రొటేషన్ పద్ధతిలో వార్డెన్ డ్యూటీలు కేటాయించేవారని, ఈ సంవత్సరం నుంచి ఆ బాధ్యతలను పూర్తిగా ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్లతోపాటు లైబ్రేరియన్లపై మోపడం ఏంటని ప్రశ్నించారు. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, లైబ్రేరియన్ల అర్హతలు, పనివిధానం డిప్యూటీ వార్డెన్ డ్యూటీకి భిన్నమని వివరించారు. ఇప్పటికైనా పునరాలోచించి ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో జనరల్ సెక్రటరీ పాపిరెడ్డి, కోశాధికారి బసవయ్య తదితరులు ఉన్నారు.