Gurukula Recruitment | హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): “ఎన్నికలకు ముందు ఓట్ల కోసం ఎగదోశారు. కాంగ్రెస్ తరఫున ప్రచారం కోసం ఊరూరా తిప్పారు. ఓట్లను వేయించుకున్నారు. పదవులను పొందారు. మమ్ముల నట్టేట్లో వదిలేసి పెదవులు మూసుకున్నారు” అంటూ పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలపై గురుకుల అభ్యర్థులు నిప్పులు చెరు గుతున్నారు. న్యాయం చేయాలని 4 నెలలుగా తిరుగుతున్నా ఆ దిశగా స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. పోస్టుల భర్తీలో డిసెండింగ్ ఆర్డర్‌ను పాటించకుండా అన్యాయం చేస్తున్నారని, బ్యాక్లాగ్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని ధ్వజమెత్తుతున్నారు. ఇకనైనా స్పష్టత ఇవ్వాలని, లేకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
గురుకులాల్లో 9,210పోస్టులను డిసెండింగ్ ఆర్డర్లో భర్తీ చేస్తామని, ఒక్క పోస్ట్ కూడా బ్యాక్లాగ్ లేకుండా చూస్తామని ట్రిబ్ నోటిఫికేషన్ ఇచ్చింది. రాత పరీక్షల వరకు అనేకసార్లు బాహాటంగానే చెప్తూ వచ్చింది. అయితే తుదకు ఎన్నికల అనంతరం మాత్రం అందుకు విరుద్ధంగా డిసెండింగ్ ఆర్డర్ హామీని తుంగలో తొక్కి పోస్టుల భర్తీని చేపట్టింది. తొలుత పీజీటీ, ఆ తరువాత డీఎల్, జేఎల్, టీజీటీ పోస్టులకు మెరిట్ జాబితాలను ప్రకటించి అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చింది. దీంతో వేలాది పోస్టులు బ్యాక్లాగ్ పడే అవకాశం ఉన్నదని అభ్యర్థులు వాదిస్తున్నారు. కనీసం రిలింక్విష్మెంట్ విధానాన్ని అమలు చేయాలని, తద్వారా పోస్టులు బ్యాక్లాగ్ పడకుండా ఉంటాయని పే ర్కొంటున్నారు. గత ఫిబ్రవరి నుంచి ట్రిబ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
నాడు ధర్నాలు చేయించిన నేతలే నేడు తమను చులకనగా చూస్తున్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ యువనాయకుడితోపాటు ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న ఓ నేత ఇప్పుడు తమ సమస్యను పరిష్కరించడం లేదని వాపోతున్నారు. ఎప్పుడు అడిగినా నేడు రేపు అంటూ దాటవేస్తున్నారే తప్ప ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఇప్పించడంలేదని మండిపడుతున్నారు. ఇదేమని అడిగితే ఉన్నత పదవి దక్కించుకున్న మరో కాంగ్రెస్ నేత తమనే దుర్భాషలాడుతున్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై ఇటీవల చర్చించేలా చూస్తానని సదరు యువనేత ఇచ్చిన హామీ సైతం ఉత్తముచ్చటే అయ్యిందని అభ్యర్థులు పేర్కొంటున్నారు.
ఇప్పటికే ఆయా సొసైటీలు పోస్టింగ్స్ ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాయని, రిలింక్విష్మెంట్ అమలు చేయకుండా పోస్టింగ్స్ ఇచ్చిన తరువాత చేసేదేమీ లేదని అభ్యర్థులు చెప్తున్నారు. పలువురు మంత్రులకు, కాంగ్రెస్ సీనియర్ నేతలకు, ఆఖరికి సీఎం రేవంత్‌రెడ్డి, సీఎంవో అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిలింక్విష్మెంట్ అమలు కోసం ఆమరణ దీక్షకు పూనుకుంటామని అభ్యర్థులు వెల్లడిస్తున్నారు. అందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందించుకొంటున్నామని, ఇక ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని గురుకుల అభ్యర్థులు తెలిపారు.