మిర్యాలగూడ టౌన్, ఆగస్టు 24 : విద్యాబుద్ధ్దులు నేర్పి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన గురువులే వారిచే చపాతీలు చేయిస్తున్నారు. ఈ ఘటనలు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని బీసీ బాలికల, బా లుర గురుకుల పాఠశాలల్లో చోటుచేసుకున్నాయి. ఆదివారం శ్రీనివాసనగర్‌లోని బీసీ బాలికల గురుకుల పాఠశాల, సమీపంలోని బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులు చపాతీలు చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి.
విద్యార్థి సంఘాల నాయకులు గురుకులాలను సందర్శించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ప్రతి ఆదివారం ఒక్కో తరగతికి చెందిన విద్యార్థులు 500 మందికి సరిపడా చపాతీలు, పూరీలు చేయిస్తారని విద్యార్థులు చెప్పుకొచ్చారు. చదువుకోవడానికి వచ్చిన వారిని పని వారి గా మార్చడంపై కలెక్టర్ తక్షణమే స్పందించాలని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రిన్సిపాల్, ఆర్సీవోను వెంటనే సస్పెండ్ చేయాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.