గద్వాల, డిసెంబర్ 24 : ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురుకుల విద్యార్థులు రోడ్డెక్కారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా బీచుపల్లిలోని పాఠశాల విద్యార్థులు 150 మంది 18 కిలోమీటర్లు పాదయాత్రగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టర్‌ను కలిసేందుకు విద్యార్థులు రావడంతో కార్యాలయ గేటుకు తాళం వేయడంతో గేటు బయటే బైఠాయించారు. అనంతరం హాల్లో రెండు గంటలకు పైగా వెయిట్ చేయించారు. చివరికి 10 మంది విద్యార్థులను తన చాంబర్లోకి కలెక్టర్ పిలిపించుకొని మాట్లాడారు.
గురుకుల ప్రిన్సిపాల్ వెంకటేశ్ తమను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని, మెనూ ప్రకారం భోజనం పెట్టడంలేదని విద్యార్థులు వివరించారు. గతంలో రెండుసార్లు సస్పెండ్ అయిన ప్రిన్సిపాల్‌ను కేటాయించారని వాపోయారు. తమను దూషించడంతో పాటు అకారణంగా చేయిచేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అతడి వేధింపులతో చాలా మంది టీసీలు తీసుకొని వెళ్లిపోయారని తెలిపారు. ఖాళీ అయిన సీట్లను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ చెప్పడంతో విద్యార్థులు శాంతించారు. వీరిని ప్రత్యేక బస్సులో బీచుపల్లి గురుకులానికి తరలించారు.
గురుకులంలో విద్యార్థులకు అవసరమైన డార్మెంటరీలు లేవు. 5వ తరగతి పిల్లలు రాత్రి పూట గుట్టపైకి వెళ్తున్నారు. విషసర్పాలు కాటేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? సమస్యలు పరిష్కరించడం లేదనే కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేయాల్సి వచ్చింది. ఒకనాడు బీచుపల్లి గురుకులం రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉండేది. నేడు సమస్యలకు కేరాఫ్‌గా మారింది.
– కేశవరెడ్డి, ఇంటర్ విద్యార్థి
విద్యార్థులు స్టడీ అవర్స్‌లో వాష్‌రూంకు వెళ్లినా నానా బూతులు తిడుతున్నారు. నీళ్లు తాగేందుకు వెళ్తే తిడుతున్నారు. తల్లిదండ్రులను కలవనీయడంలేదు. టీసీలు ఇచ్చి పంపుతుండ్రు. గురుకులంలో వసతులు లేవు. విద్యార్థుల పడుతున్న అవస్థలను ఎవరూ పట్టించుకోవడం లేదు. సీనియర్లకు ప్రాక్టికల్స్ నిర్వహించలేదు. ఈ ప్రిన్సిపాల్ మాకొద్దు..
– భరత్‌సింహ, ఇంటర్ విద్యార్థి