చెన్నూర్ టౌన్, జనవరి 23 : మంచిర్యాల జిల్లా చెన్నూరు మైనార్టీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న మారగోని ఆదర్శ్ (16) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. బీరెల్లికి చెందిన మారగోని ఆదర్శ్ బుధవారం ఉదయం స్వగ్రామం నుంచి పాఠశాలకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరాడు. కాగా ఆదర్శ్ పాఠశాలకు రాలేదని అదే రోజు సాయంత్రం విద్యార్థి కుటుంబానికి సిబ్బంది సమాచారమిచ్చారు. దీంతో కుటుంబీకులు ఆదర్శ్ కోసం రాత్రి చెన్నూరు పరిసర ప్రాంతాల్లో వెతికారు.
గురువారం ఉదయం సమీకృత మార్కెట్ సముదాయ భవనం (ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనం)లో ఆదర్శ్ మృతదేహం కనిపించడంతో పోలీసులు కుటుంబీకులకు సమాచారం అందించారు. మృతదేహం వద్ద పురుగులమందు డబ్బా కనిపించడంతో ఆత్మహత్య కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. మృతదేహాన్ని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ రవీందర్ సందర్శించారు. ఆదర్శ్ తండ్రి రవి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సుబ్బారావు తెలిపారు.