మహబూబ్‌నగర్ : సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులలో సరైన వైద్యం సకాలంలో అందక ఓ గురుకుల విద్యార్థి (Gurukul student) ప్రాణం కోల్పోయాడు. వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన 11 ఏండ్ల చేగువీర ( Cheguvera ) మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం బాలానగర్ గురుకులంలో చదువుతున్నాడు.
ఈ నెల 12 ఇంటికి వెళ్లగా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరాడు. తీవ్ర జ్వరం ఉండడంతో తల్లిదండ్రులు వనపర్తి జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు డెంగీ లక్షణాలు ఉన్నాయని, వైద్యం అందించారు. తీరా ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి ఎక్స్‌రే తీయించుకుని వస్తే ఊపిరితిత్తులలో న్యూమోనియా ఉన్నట్లు వైద్యులు ఆలస్యంగా గుర్తించి నీలోఫర్‌కు రిఫర్ చేశారు.
అయితే నిలోఫర్ బదులు మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని వైద్యుల వెల్లడించడంతో హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చేగువీరను పరిశీలించి ఆలస్యంగా తీసుకొచ్చారని ముందే తీసుకొచ్చుంటే ప్రాణాలు కాపాడే వారమని కుటుంబ సభ్యులకు వివరించారు.
చివరకు శనివారం తెల్లవారుజామున విద్యార్థి నిలోఫర్ ఆసుపత్రిలో మృతి చెందాడు. తమ కుమారుడిని వైద్యం కోసం మూడు ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ప్రాణాలు కాపాడుకోలేక పోయామని నిరుపేద తల్లిదండ్రులు కన్నీరుమున్నీయ్యారు.