హైదరాబాద్, మే 1(నమస్తే తెలంగాణ) : గన్నీ సంచుల కొరత మార్క్‌ఫెడ్ జిల్లా అధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నదా? సప్లయర్స్‌తో కుమ్మక్కై కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారా? రైతులను ముంచి దండుకొనేందుకు కుట్రలు చేస్తున్నారా? రైతులకు తక్కువ ధర చెల్లించి, ఎక్కువ ధరకు బిల్లులు పెడుతున్నారా? రైతులకు గన్నీ సంచుల కొనుగోలు పైసలు ఖాతాలో వేయకుండా చేతికి ఇవ్వడంలో మతలబేమిటి? ఈ దందా ముగ్గురు మంత్రుల జిల్లాలో మరింత జోరుగా జరుగుతున్నదా? అంటే ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానమే వ్యక్తమవుతున్నది. గన్నీల కొరతను సాకుగా చూపుతూ పలువురు మార్క్‌ఫెడ్ జిల్లా అధికారులు భారీ దోపిడీకి తెరతీశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తూ వారికి తెలియకుండా సప్లయర్స్‌తో కుమ్మక్కై ఈ తతంగాన్ని నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
రైతులకు గన్నీ సంచుల కొరత రాకుండా చూడాలన్న ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఆలోచనను అక్రమాలకు అడ్డాగా మార్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాసంగి మక్కల కొనుగోలుకు తీవ్రమైన గన్నీ సంచుల కొరత ఏర్పడింది. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు సరఫరాలో చేతులెత్తేశారు. టెండర్లు పూర్తయిన తర్వాత తమకు ఎక్కువ ధర కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆశించిన స్థాయిలో సరఫరా కాకపోవడంతో గన్నీలు దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మక్కలు కాంటా కాకపోవడంతో రోజుల తరబడి మార్కెట్లలోనే పడిగాపులు కాస్తున్నారు. ఈ పరిస్థితిని కొంతవరకు పరిష్కరించేందుకు గన్నీ సంచుల కొనుగోలు బాధ్యతను రైతులకే అప్పగించారు. ముందుగా రైతులు గన్నీలు కొనుగోలు చేసి తీసుకొస్తే వారి మక్కలను కాంటా పెడుతున్నారు. దీంతో రైతులు నానా తంటాలు పడి రేషన్ డీలర్లు, రైస్ మిల్లర్ల వద్ద గన్నీలు కొనుగోలు చేస్తున్నారు. ఇలా రైతులు ఒక్కో సంచికి రూ.25-30 వరకు వెచ్చిస్తున్నారని తెలిసింది. ధర ఎక్కువైనప్పటికీ పంట అమ్ముకోవాలనే తాపత్రయంతో రైతులు గన్నీలను కొనుగోలు చేస్తున్నారు.
గన్నీల కొనుగోలులో రైతులు తీవ్రంగా నష్టపోతుంటే.. అధికారులకు, సప్లయర్స్‌కు భారీగా లబ్ధిచేకూరుతున్నదనే ఆరోపణలున్నాయి. గన్నీల కొరత, రైతుల అవసరాన్ని పలువురు మార్క్‌ఫెడ్ జిల్లా అధికారులు, సప్లయర్స్, ఆయా జిల్లాల పీఏసీఎస్ అధికారులు కూడబలుక్కొని తమకు అనుకూలంగా మార్చుకొన్నారనే విమర్శలున్నాయి. రైతులకు తక్కువ ధర చెల్లిస్తూ.. బిల్లులు మాత్రం అధిక ధరకు పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని తెలిసింది. రైతులు బయట డీలర్లు, రైస్ మిల్లర్ల వద్ద రూ.25-30కి కొనుగోలు చేయగా వారికి రూ.13-16 మాత్రమే చెల్లిస్తున్నారని తెలిసింది. కానీ, బిల్లులు మాత్రం టెండర్ ధర రూ.23.22కు పెట్టేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. అంటే ఒక్కో సంచిపై రూ.7-10 కొల్లగొడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తద్వారా రైతులు కూడా భారీగా నష్టపోతున్నారు. ఒక్కో సంచిపై రైతులు సగటున రూ.15 వరకు నష్టపోతున్నట్టు తెలిసింది. పీఏసీఎస్‌లో నమోదైన రైతులు ఎన్ని గన్నీ సంచులు కొనుగోలు చేశారనే వివరాలను సదరు పీఏసీఎస్ నుంచి అధికారికంగా తీసుకొని ఆ మొత్తానికి టెండర్ ధర రూ. 23.22కు బిల్లులు పెడుతున్నారని తెలిసింది. రైతులకు ఎంత చెల్లించారో అంతే బిల్లు పెడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ, రైతులకు చెల్లించేది ఒకటి.. బిల్లు పెట్టేది మరొకటి కావడంతో భారీ అవినీతి జరుగుతున్నదనే ఆనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రైతులు ఎన్ని గన్నీ బ్యాగులు కొనుగోలు చేశారో అందుకు అవసరమైన డబ్బులను రైతులకు నేరుగా చెల్లిస్తున్నట్టు తెలిసింది. పీఏసీఎస్‌లో రైతులు నమోదు చేసుకొన్న వివరాల ఆధారంగా సదరు జిల్లా కాంట్రాక్ట్ దక్కించుకొన్న సప్లయర్ నేరుగా ఆయా రైతులకు డబ్బులు చెల్లిస్తున్నారని తెలిసింది. కొందరు రైతులకు అప్పటికప్పుడే చెల్లిస్తుండగా మరికొంత మంది రైతులకు వాయిదా పెడుతున్నట్టు సమాచారం. ఈ విధానం అవినీతికి ఆస్కారం కలిగించే విధంగా ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయకుండా, నేరుగా నగదు ఎందుకు ఇస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రైతు ఎన్ని టన్నుల మక్కలు విక్రయించారనే లెక్కల ఆధారంగా సదరు రైతు ఎన్ని గన్నీలు కొనుగోలు చేశారో తెలిసిపోతుంది. ఈ లెక్క ఆధారంగా ఆయా రైతులకు టెండర్ ధర రూ.23.22 చొప్పున లెక్కగట్టి మొత్తం పైసలు మక్కల నిధులతోపాటు జమ చేయొచ్చుకదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలా కాకుండా నేరుగా డబ్బులు ఇవ్వడమంటే ఏదో మతలబు ఉన్నదనే అనుమానాలొస్తున్నాయి. గతంలో కరోనా సమయంలో ఇలాంటి పరిస్థితే ఎదురవ్వగా, రైతుల ఖాతాల్లోనే గన్నీ సంచుల డబ్బులు జమ చేశారని తెలిసింది. అదే పద్ధతిని అవలంబించడం వల్ల రైతులకు నష్టం జరుగదని, అవినీతికి ఆస్కారం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లాలో ఈ గన్నీల దందా మరింత జోరుగా సాగుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ జిల్లాలోని ఓ కీలక అధికారి ఈ దందాలో ఏకంగా రూ.కోటికి స్కెచ్ వేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సప్లయర్‌తో పూర్తిగా కుమ్మక్కై భారీ దందాకు తెరలేపారనే ఆరోపణలొస్తున్నాయి. ఇప్పటివరకు సదరు జిల్లాలో లక్ష టన్నులకుపైగా మక్కలు కొనుగోలు చేయగా ఇందుకోసం 20 లక్షల గన్నీలు అవసరం. అయితే, సదరు జిల్లా దక్కించుకొన్న సప్లయర్ పూర్తిగా చేతులెత్తేసినట్టు తెలిసింది. 20 లక్షల గన్నీలకుగాను సదరు సప్లయర్ కేవలం లక్ష గన్నీలు మాత్రమే సరఫరా చేశారని తెలిసింది. మిగిలిన 19 లక్షల గన్నీలు రైతులే కొనుగోలు చేసి తీసుకొచ్చినట్టు తెలిసింది. ఈ లెక్కన ఒక్కో సంచిపై రూ.7-10 కమీషన్ల రూపంలో దండుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇందులో సదరు కీలక అధికారి తన వాటాగా ఒక్కో సంచికి రూ. 2 వసూలు చేస్తున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని, ఆ తర్వాతే బిల్లులు మంజూరు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. రైతుల కడుపుకొట్టి.. వారిని ముంచి.. కోట్లు కొల్లగొట్టడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.