హైదరాబాద్, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ): పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గుండు లక్ష్మణ్ ఎన్నికయ్యారు. ఆదివారం నారాయణగూడలోని పీఆర్టీయూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో లక్ష్మణ్‌ను ఏకగ్రీవంగా ఎన్నకున్నారు. లక్ష్మణ్ ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు ఉద్యోగ విరమణతో ఈ పోస్టుకు ఖాళీ ఏర్పడింది. అక్టోబర్ 7న రాష్ట్ర శాఖకు ఎన్నికలు జరగనున్నాయి. అప్పటివరకు ప్రధాన కార్యదర్శిగా లక్ష్మణ్ కొనసాగుతారని రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి ప్రకటించారు. సమావేశంలో ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు బీ మోహన్‌రెడ్డి, పూల రవీందర్, మాజీ అధ్యక్షుడు పీ వెంకట్‌రెడ్డి, పంచాయతీరాజ్ ఉపాధ్యాయ మాసపత్రిక ప్రధాన సంపాదకుడు తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి పాల్గొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): హైడ్రా పేరిట సీఎం రేవంత్‌రెడ్డి ఆడుతున్నది డ్రామా తప్ప సమాజహితం కోసం కాదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. బందిపోట్లలాగా ఇండ్లను కూల్చుతూ పేదల బతుకుల్లో ముఖ్యమంత్రి మన్నుపోశాడని విమర్శించారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్మశానవాటికకు, గుడికి, క మ్యూనిటీ హాల్‌కు కూడా నోటీసు ఇచ్చారంటే రేవంత్‌రెడ్డికి ఎంత తెలివి ఉన్నదో తెలుస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్రమ నిర్మాణాలకు కారకులకు శిక్ష వేయాలని, వారి నుంచే రికవరీ చేయాలని, చట్టబద్ధంగా నడుచుకోవాలని సూచించారు. పేదల పక్షాన మాట్లాడే వారి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తమ సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. పేదల ఇండ్లు కూలిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.