హైదరాబాద్, ఏప్రిల్ 21, (నమస్తే తెలంగాణ): రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. గుజరాత్‌లోని దాహోద్ జిల్లాలో రూ.21,969 కోట్లతో రైల్వే లోకో మోటివ్ యూనిట్‌కు ఇటీవలే శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి మోదీకి, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఉత్తర, దక్షిణ భారతానికి భౌగోళకంగా కేంద్ర బిందువుగా ఉన్న తెలంగాణను కేంద్ర ప్రభుత్వం విస్మరించడం తగదని అన్నారు.
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో రైల్వేల పరంగా అనేక అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉన్నదని తెలిపారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరించేందుకు సిద్ధం ఉన్నా, కేంద్రం వివక్ష చూపుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు మాత్రమే కేంద్రం ప్రాధాన్యం ఇస్తున్నదని విమర్శించారు. ఉత్తరాది రాష్ట్రాలకే ప్రాజెక్టులన్నీ కట్టబెడుతున్నదని, హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాల్సిన గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్‌ను గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు తరలించారని ఆగ్రహం వ్యక్తంచేశారు.