హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) : అహ్మదాబాద్‌లో అరెస్టయిన ఉగ్రవాది అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్‌కు సంబంధించి మరింత సమాచారాన్ని సేకరించేందుకు గుజరాత్ ఏటీఎస్ బృందం ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగా మంగళవారం రాత్రి స్థానిక పోలీసులతో కలిసి రాజేంద్రనగర్ ఫోర్ట్‌వ్యూ కాలనీ, అసద్ మంజిల్‌లో సోదాలు జరిపారు. మొహియుద్దీన్ నివాసంతోపాటు అతడు ప్రయోగాలు జరిపిన గదిని పరిశీలించారు.
మొహియుద్దీన్ ప్రవర్తన, రోజువారీ కార్యకలాపాలు, ఉగ్ర కోణంలో అతనికి సహకరించిన స్నేహితులు, సన్నిహితులు తదితర అంశాలపై కుటుంబ సభ్యులను ఆరా తీశారు. మొహియుద్దీన్ సెల్‌ఫోన్ కాల్‌డాటా ఆధారంగా అతని సన్నిహితులపై కూపీ లాగుతున్నారు. మొహియుద్దీన్ స్వస్థలమైన ఖమ్మంకు సైతం దర్యాప్తు బృందాలు వెళ్లి, అతని కార్యకలాపాలపై ఆరా తీస్తునట్టు తెలిసింది.