Rajiv Yuva Vikasam | హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ఊదరగొడుతున్న రాజీవ్ యువవికాసం పథకం కింద సబ్సిడీ రుణాలు పొందాలంటే ఎన్నో అడ్డంకులను దాటాల్సి వస్తున్నది. తొలుత బ్యాంకర్లు సమ్మతిస్తేనే ఈ పథకం కింద రుణం పొందే అవకాశం ఉంటుంది. తర్వాత సిబిల్ స్కోర్ ప్రామాణికంతోనే బ్యాంకు అధికారులు లబ్ధిదారుల ఎంపికకు ఆమోదం వేస్తారని తెలుస్తున్నది.
సిబిల్ స్కోర్ ఆశించిన స్థాయిలో లేకుంటే సబ్సిడీ రుణం అందని ద్రాక్షగానే మిగులుతుంది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కాకుండా మిగతా మొత్తం నిధులకు వడ్డీ భారం పడనున్నది. అది కూడా 10 నుంచి 12 శాతం వడ్డీ ఉంటుందని అధికారులే వెల్లడిస్తున్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ తదితర వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
అందులో భాగంగా రూ.6,000 కోట్లతో రాజీవ్ యువవికాసం పథకాన్ని ప్రారంభించింది. ఈ నెల 14 వరకు దరఖాస్తులను స్వీకరించగా, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 16 లక్షల మందికిపైగా వివిధ యూనిట్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నది. జూన్ 2న నిర్దేశిత లక్ష్యం మేరకు రుణాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.
సబ్సిడీ రుణాల మంజూరులో బ్యాంకు అధికారులే కీలకపాత్ర పోషించనున్నారు. దరఖాస్తులను తొలుత మండల స్థాయి కమిటీ పరిశీలిస్తుంది. ఈ కమిటీలో ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్, జోనల్ కమిషనర్, కలెక్టర్ నియమించిన ప్రత్యేక అధికారి, బ్యాంకు మేనేజర్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ కార్పొరేషన్ల ప్రతినిధులు, డీఆర్డీఏ ప్రతినిధులు ఉండనున్నారు. ఇతర అధికారులకన్నా బ్యాంకు అధికారే ఈ కమిటీలో కీలకంగా ఉంటారు. పాన్, ఆధార్కార్డులతోపాటు బ్యాంకు వివరాలను దరఖాస్తు సమయంలోనే సేకరించారు.
వాటి ఆధారంగా దరఖాస్తుదారుడి సిబిల్ స్కోర్ (రుణ పరపతి) ఎలా ఉందనేది పరిశీలిస్తారు. నిర్దేశిత ప్రమాణాల మేరకు సిబిల్స్కోర్ ఉండి, బ్యాంకు అధికారి సంతృప్తి చెందితేనే రుణం మంజూరుకానున్నది. లేదంటే సబ్సిడీ రుణం అందకుండా పోతుంది. గతంలో ఏవైనా రుణాలను తీసుకుని సక్రమంగా చెల్లించని వారి, సిబిల్స్కోర్ లేని వారికీ రుణం దక్కడం అనుమానమే. బ్యాంకర్ల ఆమోదంతోనే మండల కమిటీ లక్షిత యూనిట్ల మేరకు అర్హుల జాబితాను సిద్ధం చేసి జిల్లాస్థాయి కమిటీకి పంపుతుంది.
రాజీవ్ యువవికాసం పథకం కింద ఇచ్చే సబ్సిడీ రుణాన్ని కూడా 10 నుంచి 12 శాతం వడ్డీతోనే మంజూరు చేయనున్నారు. నిర్ణీత వాయిదాల్లో అసలు, వడ్డీని కలిపి లబ్ధిదారుడు తిరిగి బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం కేవలం రూ.50 వేల యూనిట్ మాత్రమే 100 శాతం సబ్సిడీతో అందిస్తున్నది. మిగతా రుణాల్లో ప్రభుత్వం సబ్సిడీ పోను, మిగతా సొమ్మును బ్యాంకు రుణంగా అందజేయనున్నది.
ఉదాహరణకు రూ.4 లక్షల యూనిట్లో రూ.2.80 లక్షలను ప్రభుత్వం, మిగతా రూ.1.20 లక్షలను బ్యాంకు రుణంగా అందివ్వనున్నది. ఆ రుణ మొత్తానికి 10-12 శాతం వడ్డీని ఆ బ్యాంకు వసూలు చేయనున్నది. ఈ విషయంపై బ్యాంకు అధికారులను సంప్రదిస్తే తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు, మార్గదర్శకాలు లేవని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలోనే వ్యక్తిగత రుణాలను మంజూరు చేసినప్పుడు విధించే వడ్డీ చార్జీలనే వర్తింపజేస్తున్నామని వివిధ బ్యాంకుల అధికారులు తెలిపారు.
ఈ రాజీవ్ యువవికాసం పథకం తరహాలోనే గతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్లు ఆయా వర్గాలకు సబ్సిడీ రుణాలను మంజూరు చేసేవి. ఈ బ్యాంకు లింకేజీ రుణాల్లో అనేక సమస్యలు ఎదురయ్యాయి. ప్రధానంగా లబ్ధిదారులు బ్యాంకులు మంజూ రు చేసిన రుణాలను తిరిగి చెల్లించని పరిస్థితి నెలకొన్నది. ఫలితంగా బ్యాంకులు ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో బ్యాంకులు సైతం లింకేజీ రుణాల మంజూరుకు నిరాసక్తత చూపుతూ వచ్చాయి. దీంతో రుణాల మంజూరు మందకొడిగా కొనసాగేది.
ఈ నేపథ్యంలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం లింకేజీ రుణాలకు స్వస్తి పలికింది. బ్యాంకులతో సంబంధం లేకుండా 100 శాతం సబ్సిడీతో వృత్తిదారులు, ఆయా వర్గాలకు స్వయం ఉపాధికి బాటలు వేసింది. అందులో భాగంగా బీసీబంధు, మైనార్టీ బంధు తదితర పథకాలను విజయవంతంగా అమలు చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం మళ్లీ బ్యాంకు లింకేజీ రుణాలనే అందించేందుకు మొగ్గుచూపింది. కానీ రుణాల మంజూరుకు పలు బ్యాంకులు మాత్రం ఇప్పటికే నిరాసక్తత చూపుతున్నట్టు తెలుస్తున్నది.