HYDRA | హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): అవి హైదరాబాద్‌కు తాగు నీళ్లందించిన జంట జలాశయాలు. ఇప్పుడవి కుంటలయ్యాయి. పక్కనే రాజభవనాలు వెలిశాయి. అవన్నీ ప్రముఖులవే. అందులోనూ కాంగ్రెస్ నాయకులవే అధికం. చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు అపరిమిత అధికారాలు అప్పగించిన సర్కారు అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతానంటున్నది. కానీ జలాశయాల సమీపంలో కట్టుకున్న కాంగ్రెస్ నాయకుల ఫాంహౌస్‌లు మాత్రం సర్కారుకు కనిపించడం లేదు. వీటి జోలికి వెళ్లని ప్రభుత్వం కొంతమందినే లక్ష్యంగా చేసుకొని సోషల్‌మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ నేతల రాజభవనాలను సర్కారు నేలమట్టం చేసేందుకు సాహసిస్తుందా?
ఫామ్‌హౌస్ కథా కమామిషుపై నమస్తే తెలంగాణ ప్రత్యేక బృందం గుండాల కృష్ణ, కడవేర్గు రాజశేఖర్, దుద్దాల రాజు, బేగరి శ్రీనివాస్‌లు ఫొటో గ్రాఫర్ రజినీకాంత్‌తో కలిసి అందిస్తున్న ప్రత్యేక కథనం…
పొంగులేటి.. ఈ రాజప్రాసాదాలేంటి?
ఏంటి ఈ ఫొటో చూడగానే గోవాలోని రిసార్టులు అనుకొంటున్నారా? కాదు మన హైదరాబాదే. హిమాయత్‌సాగర్‌కు ఆనుకొని ఉన్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఆయన సోదరుల గెస్ట్ హౌస్‌లు ఇవి. ఎరుపు రంగు రూఫ్టైల్స్తో మెరిసిపోతున్న విలాసవంతమైన నిర్మాణం పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిది. ఆధునికత ఉట్టిపడేలా నలుపు రంగు షెడ్స్ ఉన్నవి ఆయన సోదరుడివి. ఈ నిర్మాణాల పక్కనే జలాశయం కనిపిస్తున్నది కదూ. వాస్తవానికి ఈ గెస్ట్‌హౌస్‌లు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయని స్పష్టమైన ఆరోపణలు ఉన్నాయి. కానీ దీన్ని నిర్ధారించే జలమండలి రాళ్లు ఎక్కడున్నాయో… ఉన్న ప్రదేశం నిజమైనదో! కాదో!! తేల్చుకోలేని దుస్థితి. ఈ నేపథ్యంలో కచ్చితంగా ఈ నిర్మాణాలు బఫర్‌జోన్‌లోనే ఉన్నాయనేది చూసే ప్రతి ఒక్కరికీ ఇట్టే అర్థమవుతుంది.
పట్నం శివారుల్లో ‘పట్నం’ వారి గెస్ట్‌హౌస్
ఏవావ్.. ఇదేంటి? నీటి మధ్యలో ఐల్యాండ్. అందులో ఎంతో అందమైన భవనం. ఈ ఫొటో చూడగానే.. లేక్‌వ్యూ పాయింట్ అంటే ఇట్లుండాలి. అనుకొంటున్నారు కదూ..! అయితే, ప్రస్తుత ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అభిరుచిని మీరు పొగడాల్సిందే మరి. ఎందుకంటే ఈ భవంతి ఆయనదే. ఇంకో విషయం ఆయన రూటు ఎంతో సపరేటు. ఎందుకంటారా? లేక్‌వ్యూ పాయింట్ కోసమని చెరువు గట్టున విల్లా కట్టుకోవడం చూసే ఉంటాం. అయితే, ఆయన ఏకంగా హిమాయత్‌సాగర్ ఎఫ్‌టీఎల్‌లోనే తన గెస్ట్‌హౌస్ నిర్మించుకున్నారు. ఇది జగమెరిగిన సత్యం. దాదాపు దశాబ్దంన్నర కిందట జంట జలాశయాల చెంతన కేవలం ఫాంహౌస్‌ల సంస్కృతి మాత్రమే ఉండేది. కానీ గెస్ట్‌హౌస్ సంస్కృతిని పట్నం వారే పట్నానికి ప్రవేశపెట్టారనేది రంగారెడ్డి జిల్లాలో బాగా ప్రాచుర్యంలో ఉన్న ప్రచారం.
కేవీపీ కథ పేరు ‘అనంతం’..
‘ఇసంత రా.. అంటే ఇళ్లంతా నాదే అన్నాడట.. వెనుకటికి ఒకడు’.. ఇప్పుడు మీరు చదువబోయే వార్త కూడా అలాంటిదే. కేవీపీ రామచంద్రరావు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఢిల్లీ నుంచి గల్లీదాకా బాగా తెలిసిన పేరు. అవునా..? ఇక, విషయంలోకి వద్దాం. హిమాయత్‌సాగర్ ఎఫ్టీఎల్లో తొలుత కొద్దిగా ఓ నిర్మాణం మొదలైంది. ఇంకేంటి.. సందు దొరికింది కదా.. ఆ తర్వాత అతితక్కువ కాలంలోనే బఫర్‌జోన్‌లోనూ పూర్తిస్థాయి నిర్మాణాలతో చివరకు ఓ అందమైన గెస్ట్‌హౌస్ సిద్ధమైంది. అది కేవీపీ రామచంద్రరావుదే. విశాలమైన రహదారులతో చెరువు కనిపించకుండా చుట్టేసిన ఈ గెస్ట్‌హౌస్‌కు ‘అనంతం’గా నామకరణం చేసుకున్నారు ఆయన. చుట్టూ భారీ ప్రహరి నిర్మాణంతో పాటు లోపల కూడా భారీ నిర్మాణాలు ఉన్నాయి.
వైవీ.. నడిమధ్యలో ఠీవీ!
ఏపశువులు తినకుండా చెట్లను కాపాడటానికి ఈ ప్రహరికట్టారనుకొంటున్నారా? అయితే, మీరు పొరపడినట్లే. సాగరం నోట్లో మట్టికొట్టి ఈ నిర్మాణాన్ని చేపట్టారు. హిమాయత్‌సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలోనే పూర్తిగా విస్తరించి ఉన్న ఈ నిర్మాణం టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిది. ఏకంగా సాగర్‌లో భారీ ట్రక్కులతో వందల క్యూబిక్ మీటర్ల మట్టి పోసి రిజర్వాయర్ కుంచించుకుపోయేలా చేశారు. ఆరు అడుగుల ఎత్తున కొత్తగా మట్టి నింపారనేది స్థానికులు చెబుతున్న వాస్తవం. మట్టికే దాదాపు అర కోటి వరకు ఖర్చు చేశారని భోగట్టా. ప్రస్తుతానికి చుట్టూ భారీ ప్రహరి నిర్మాణం పూర్తయింది. ఇప్పటికైతే ఇంకా నిర్మాణాలు మొదలు కాలేదు.
వివేకం వారి Vస్తరణ స్టోరీ!
ఎర్రని నేలల్లో, పచ్చటి చెట్ల మధ్య తెల్లని పాలరాతి భవనంలా మెరిసిపోతున్న ఈ భారీ ఫాంహౌస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిది. దశాబ్దాల కిందటనే పూర్తిగా బఫర్‌జోన్‌లో పెద్ద ఎత్తున ఈ ఫాంహౌస్ నిర్మాణం జరిగింది. ఇది కాకుండా కొంతకాలం కిందట మరో బహుళ అంతస్తుల భవనాన్ని కూడా నిర్మించారు. అదైతే పూర్తిగా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉందనేది బహిరంగ రహస్యం. విశాలమైన రహదారులతో డెడ్ఎండ్గా ఉన్న ఈ ఫాంహౌస్ గేటు ముందుకు వెళ్లారో ఎక్కువసేపు అక్కడ ఉండలేరు. ఎందుకంటే అక్కడి భారీ సంఖ్యలో ఉన్న సెక్యూరిటీ గార్డులు మిమ్మల్ని తరిమికొట్టడానికి పరిగెత్తుకొని వస్తారు మరి.
సర్పంచ్ అనుమతితో సీఎం బంధువు ఫాంహౌస్
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లి గ్రామ పరిధిలో ఫాంహౌస్ ఇది. ఇది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీప బంధువు రవికాంత్‌రెడ్డి పేరిట ఉంది. 111 జీవో నిబంధనలకు నీళ్లొదిలి చేపట్టిన నిర్మాణం ఇది. నిబంధనల ప్రకారం ఉన్న విస్తీర్ణంలో కేవలం పది శాతం మాత్రమే నిర్మాణాలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించి ఈ అందమైన భవనాన్ని నిర్మించారు. ముఖ్యంగా ఈ నిర్మాణాలకు వట్టినాగులపల్లి అప్పటి సర్పంచ్ అనుమతులు ఉన్నాయే తప్ప ప్రభుత్వం హైకోర్టులో వాదించినట్టు పంచాయతీ కార్యదర్శిదిగానీ, మున్సిపాలిటీ అనుమతులు గానీ లేవు.
సాగరంలో కొలువుదీరిన శ్రీ‘నిధి’
సాగర గర్భంలో నిధులు ఉంటాయని అంటారు. అదేమో గానీ.. సాగరంలోనే కొలువుదీరిన ఈ శ్రీనిధిని చూశారా? ఇంద్రభవనాన్ని తలదన్నేలా ఉంది కదూ ఈ ఇల్లు. ఇక, ఆ క్రీడా మైదానం గురించి ఎంత చెప్పినా తక్కువే కదూ. హిమాయత్‌సాగర్‌ను ఆనుకొని ఒక మహా సామ్రాజ్యంలా నిర్మితమైన ఈ శ్రీనిధి విద్యా సంస్థలు, వాటి యజమాని కేటీ మహి నివాస సముదాయాన్ని చూసేందుకు రెండు కండ్లు కూడా సరిపోవు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి సుపరిచితుడు దీని యజమాని పేరు కేటీ మహి అని సమాచారం. అంతేకాదు… గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడే భారీ నగదు మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో పొంగులేటి కోసమే నగదును తరలిస్తున్నారనే వాస్తవం గుప్పుమంది. కాగా ఈ నివాస సముదాయం కొంత ఎఫ్టీఎల్లో ఉందనేది సుస్పష్టం. ఇక.. బఫర్‌జోన్‌ను పూర్తిగా ఆక్రమించుకొని భారీ నిర్మాణాలు చేపట్టారు. దీంతో పాటు క్రీడా మైదానంలోనూ నిర్మాణాల జోరు. ఇలా హిమాయత్‌సాగర్‌ను ఆనుకొని దాదాపు వంద ఎకరాల వరకు ఇది ఉంటుందనేది స్థానికంగా ఉన్న ప్రచారం.
అనితర సాధ్యం..అద్దాల ప్రహరి!!
హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): అద్దాల మేడ గురించి వినే ఉంటారు. చూడటం కూడా జరిగే ఉంటుంది. అయితే, కాంపౌండ్ వాల్‌ను కూడా అద్దాలతో నిర్మించడం, అవి కూడా మనిషి కంటే ఎక్కువ ఎత్తులో ఉండేలా ఏర్పాటు చేయడం ఎక్కడైనా చూశారా? అయితే, వెంటనే పక్కనున్న ఫొటోలు చూసేయండి. గండిపేట జలాశయం ఎఫ్టీఎల్ పరిధిలో కనిపిస్తున్న ఈ అద్దాల మేడ రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి సమీప బంధువుదని ఆ ఇంట్లో పనిచేసేవారే చెప్పారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు ఆమె. ఇందులో కొంతమేర ఎఫ్టీఎల్ పరిధి ఉండగా… బఫర్‌జోన్‌లోనూ చాలా మేరకు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ విశేషమేమంటే… ఈ అద్దాల మేడ చుట్టూ గండిపేట జలాశయం విస్తరించి ఉన్నప్పటికీ భూతద్దం వేసి వెతికినా ఎక్కడా ఎఫ్టీఎల్ హద్దు రాళ్లు కనిపించవు. అవేమయ్యాయో ప్రత్యేకంగా చెప్పాలా?
కూల్చివేతల్లో ఇదో వింత
గండిపేట జలాశయం ఎఫ్టీఎల్ పరిధిలో ఉందంటూ… తన పరిధిని దాటుకొని పోయి హైడ్రా కూల్చివేసిన మూడు బహుళ అంతస్తుల నిర్మాణాలు ఇవే. ఈ కూల్చివేతలతోనే హైడ్రా అడుగులపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అవుటర్ రింగు రోడ్డు వరకు మాత్రమే హైడ్రా పరిధి అని జీవో నెంబరు 99లో స్పష్టంగా ఉన్నప్పటికీ… అవుటర్ దాటి 15 కిలోమీటర్ల దూరంలోని అప్పోజిగూడలో ఉన్న ఈ నిర్మాణాలను హైడ్రా యంత్రాంగం భారీ క్రేన్లు, పొక్లెయినర్లతో వచ్చి నేలమట్టం చేసింది. హైడ్రా జీవోలో ఎక్స్టెండెడ్ యూఎల్బీ, జీపీ జాబితాలో కూడా అప్పోజీగూడ లేదు. నోటీసులు ఇవ్వడం మాట దేవుడెరుగు… కనీసం అందులో ఉన్న ఫర్నీచర్, ఇతర సామగ్రిని తీసుకునేందుకు కూడా సమయం ఇవ్వకుండా క్షణాల్లో ఈ నిర్మాణాలను కూల్చివేశారు. అయితే క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తే… ఈ నిర్మాణాలు ఒక వెంచర్లో ఉన్నాయి. వెంచర్ ముఖద్వారం నుంచి లోపలికి వెళ్లగానే కుడివైపు గండిపేట చెంతనే భారీ నిర్మాణాలు (ఇప్పుడు కూల్చివేసిన నిర్మాణాలకు సమాంతరంగా) కొనసాగుతున్నాయి.
హైడ్రా యంత్రాంగం వాటి ముందుగానే కూల్చివేతలకు వెళ్లిందని అర్థమవుతుంది. ఇక హైడ్రా కూల్చివేసిన మూడు నిర్మాణాల వెనక (మధ్యలో రోడ్డు) మరో భారీ నిర్మాణం రూపుదిద్దుకుంటున్నది. దీంతో ఆ నిర్మాణం ముందు నిలబడే హైడ్రా యంత్రాంగం కూల్చివేతలు చేపట్టింది. ఇంకాస్త ముందుకు వెళితే రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి సమీప బంధువుగా చెబుతున్న అద్దాల మేడ ఉంటుంది. కూల్చివేసిన నిర్మాణాలు ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తే మిగిలిన నిర్మాణాలు అవే పరిధిలో ఎందుకు రావో అటు జలమండలి, ఇటు హైడ్రా యంత్రాంగానికే తెలియాలి. కనీసం సామాన్యుడు ఎఫ్టీఎల్ను నిర్ధారించుకునేందుకు అక్కడ ఎక్కడా హద్దు రాళ్లు లేవు. పోనీ… కూల్చివేసిన నిర్మాణాల వరకు మాత్రమే ఎఫ్టీఎల్ పరిధిలో ఉందనే సాకును చూపినా… ఎలాగూ వంద ఫీట్ల బఫర్ జోన్ ఉంటుంది. బఫర్‌జోన్‌ను రక్షించాల్సిన బాధ్యత కూడా ఇదే యంత్రాంగంపై ఉంది. కానీ ఆ బాధ్యతను విస్మరించడమే ఇప్పుడు హైడ్రా అడుగులపై విస్తృత చర్చకు దారి తీసింది.
హద్దురాయి సాక్షిగానే నిర్మాణాలు
సాగరం ఒడ్డున.. పంట పొలాల మధ్యలో రాజసాన్ని ఒలకబోసేలా నిర్మించిన ఈ ఫాంహౌస్ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిది. హిమాయత్‌సాగర్ ఎఫ్టీఎల్ హద్దు రాయి సాక్షిగా ఈ భారీ నిర్మాణం రూపుదిద్దుకున్నది. నిబంధనల ప్రకారం ఎఫ్టీఎల్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు. అయినప్పటికీ ఈ భారీ నిర్మాణాన్ని చేపట్టారు. అంతేకాదు.. ఈ ఫాంహౌస్ గేటు ముందు ఉన్న ఖాళీ ప్రదేశంలోనే ఫ్లోరింగ్‌ను గ్రానైట్ బండలతో నింపడాన్ని చూస్తే, ఈ భవనం ఎంత ఖరీదైందో అంచనా వేసుకోవచ్చు.
గండిపేటకు చెంత చెలి‘మేడ’!!
గండిపేట ఎఫ్టీఎల్ పరిధిలో రూపుదిద్దుకున్న ఈ గెస్ట్ హౌస్ గ్రీన్కో గ్రూపు ఎండీ చలమలశెట్టి అనిల్‌కుమార్‌ది. ప్రధాన రహదారి నుంచి మొదలై జలాశయం ఎఫ్టీఎల్లోకి చొరబడి మరీ ఈ గెస్ట్‌హౌస్ నిర్మాణాన్ని చేపట్టారు. అంటే ఈ గెస్ట్‌హౌస్ ఏ మేరకు విస్తరించి ఉందో మీరే ఊహించుకోండి. ఇందులో మరో విశేషమేమిటంటే… రోడ్డు వైపునకు ఎవరైనా ఇంటి గేటు పెడతారు. అయితే ఈ గెస్ట్‌హౌస్‌కు రహదారివైపు ప్రహరి నిర్మాణాన్ని చేపట్టి.. లోపల జలాశయం వైపు మాత్రం ఇనుప కంచె వేశారు. అంతటితో ఆగకుండా ఆ ఐరన్ ఫెన్సింగ్తోనే జలాశయం ఎఫ్టీఎల్ను వీళ్లు నిర్ధారించారనే ఆరోపణలు ఉన్నాయి. అంటే ఒకవిధంగా గండిపేటకే హద్దు నిర్ణయించారన్న మాట.
రంగరంగా..పక్కది కూలిందెట్ల… ఇది కూలదెట్ల?!
ఇటీవల హైడ్రా కూల్చివేసిన నిర్మాణం ఇది. గండిపేట జలాశయం ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నందున కూల్చివేశామనేది హైడ్రా స్పష్టీకరణ. మరి… దానిని ఆనుకునే మరో నిర్మాణం ఉంది. అది ఎఫ్టీఎల్ పరిధిలోకి రాదా? అనేది సామాన్యుడి సందేహం. ఒకవేళ కూల్చివేయని నిర్మాణం పక్కనుంచే ఎఫ్టీఎల్ గీత వెళ్లిందనే సాకు చూపే అవకాశాలు ఉండొచ్చు. అదే నిజమైతే… ఎఫ్టీఎల్ను ఆనుకొని వంద ఫీట్ల వరకు బఫర్‌జోన్ ఉంటుంది. బఫర్‌జోన్‌ను కాపాడాల్సింది కూడా అదే హైడ్రా కదా! కానీ ప్రత్యేకంగా ఓ నిర్మాణాన్ని కూల్చడం.. మరో నిర్మాణాన్ని కూల్చకుండా వదిలేయడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
హైడ్రాకు కనిపించని గెస్ట్‌హౌస్..
గండిపేట జలాశయం బఫర్‌జోన్‌తో పాటు కొంతమేర ఎఫ్టీఎల్ పరిధిలోనూ నిర్మాణమైన ఈ గెస్ట్‌హౌస్ కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లంరాజుది. అందుకే హైడ్రాకు ఇది కనిపించలేదు. ఇదే వరుసలో ఉన్న ఒక స్పోర్ట్స్ అకాడమీ పరిధిలోని నిర్మాణాలను ఇటీవలే హైడ్రా యంత్రాంగం కూల్చివేసింది. కానీ దీని జోలికి మాత్రం రాలేదు. అసలు హైడ్రా అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. విషయమేంటని ఆరా తీస్తే, కూల్చివేతలకు హైడ్రా సిద్ధమైందని తెలియగానే.. సదరు కేంద్ర మాజీ మంత్రివర్యులు ఆగమేఘాల మీద ఢిల్లీ నుంచి ఫోన్లు చేయించారని రాజకీయవర్గాల్లో గుప్పుమన్న ప్రచారం. ఇది సక్రమ నిర్మాణమా?? అక్రమ నిర్మాణమా?? అని దీన్నిబట్టి అర్థమవ్వట్లేదూ..!