హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు రాష్ర్టానికి చెందిన కమ్యూనిటీలో ఐకమత్యాన్ని చాటుతున్నందుకు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ)కు అరుదైన గౌరవం దక్కింది. ఈ మేరకు ప్రతిష్ఠాత్మక లోడొన్ కౌంటీ ప్రొక్లమేషన్ అవార్డుతోపాటు ప్రశంసాపత్రాలను సంస్థ ప్రతినిధులకు అందజేసినట్టు జీటీఏ ఫౌండర్ అండ్ చైర్మన్ విశ్వేశ్వర్ కాలవాల బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జీటీఏ సంస్థ నిర్వహిస్తున్న బతుకమ్మ, దసరా సంబరాలను ప్రత్యేకంగా కొనియాడినట్టు పేర్కొన్నారు. తెలంగాణతోపాటు అమెరికాలో చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించినట్టు వెల్లడించారు.