KCR | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ పాలనలో తెలంగాణలో జరిగిన ఆర్థిక జైత్ర యాత్రను ఐసీఆర్ఏ (ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ) సంస్థ కండ్లముందు నిలిపింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధిని దాచిపెట్టి అప్పులను బూచిగా చూపేడుతూ రాష్ట్రం దివాలా తీసిందంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రచారమంతా తప్పేనని మరోసారి రుజువైంది. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక రంగంలో తెలంగాణ కొత్త శిఖరాలకు చేరిందని మరో నివేదిక గణాంకాలతో కుండబద్దలు కొట్టింది. తెలంగాణ రాష్ట్రం ఆర్థికాభివృద్ధిలో దూసుకుపోతున్నదని, తలసరి జీఎస్వీఏలో దేశంలోనే ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నట్టు ఐసీఆర్ఏ (ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ) సంస్థ తేల్చిచెప్పింది. ఈ మేరకు 2014-15 నుంచి 2023-24 వరకు ‘స్టేట్ ఎకనమిక్ ట్రెండ్స్ మే-2025’ పేరిట నివేదికను విడుదల చేసింది.
సంపదను సృష్టించడమే కాదు దాన్ని రెట్టింపు చేయడం ఎలాగో బీఆర్ఎస్ సర్కారు చేసి చూపించింది. రాష్ట్ర సత్తాను దేశానికి చాటిచెప్పింది. కొత్తగా ఏర్పడిన ఓ రాష్ర్టానికి దశాదిశను చూపించడమే కాకుండా అభివృద్ధి అంటే ఏమిటో రాష్ర్టాలకు కండ్లకు కట్టినట్టు చూపించింది. ఒక రాష్ట్ర అభివృద్ధికి కొలమానాలు అంకెలే. తలసరి ఆదాయం, జీఎస్డీపీ పెరుగుదలను పరిశీలిస్తే ఆ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో అంచనా వేయవచ్చు. తెలంగాణ కూడా ఆ ఆర్థికాభివృద్ధిని అనతి కాలంలోనే సాధించింది. కేసీఆర్ పదేండ్ల పాలనలో ఇది సాకారమైంది. 2014లో కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పు డు 2014-15లో తలసరి జీఎస్వీఏలో రాష్ట్రం 9వ స్థానంలో ఉంది. 2023-24నాటికి దేశంలోనే మొదటి స్థానానికి చేరింది. 2014-15లో తెలంగాణ తలసరి జీఎస్వీఏ రూ. 1.25 లక్షలుగా (ప్రస్తుత ధరల్లో) ఉండగా, 2023-24 నాటికి ఇది రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగి రూ.3.5 లక్షలకు (ప్రస్తుత ధరల్లో) చేరింది. ఇదే సమయంలో తెలంగాణ సమ్మిళిత వార్షిక వృద్ధిరేటు (కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్‌రేట్-సీఏజీఆర్) 6.8 శాతంగా నమోదైంది. ఇది జాతీయ సగటు 5.8 శాతం కంటే ఎక్కువ అని ఐసీఆర్ఏ నివేదిక వివరించింది.
బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ వ్యవసాయ రంగం రూపురేఖలే మారిపోయాయని ఐసీఆర్ఏ నివేదిక కొనియాడింది. కేసీఆర్ పాలనలో వ్యవసాయరంగంలో తెలంగాణ సమ్మిళిత వార్షిక వృద్ధిరేటు 6.2 శాతంగా నమోదైనట్టు వెల్లడించింది. ధాన్యం దిగుబడిలో చాలా రాష్ర్టాలను అధిగమించిన తెలంగాణ సా గులో 6 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధిరేటును నమో దు చేసింది. దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని నివేదిక వివరించింది. తెలంగాణలో సాగురంగం విస్తరించడానికి నీటి పారుదల వసతులు పెరగడమే కారణమని నివేదిక పేర్కొంది. 2014-15తో పోల్చితే 2023-24 నాటికి నీటిపారుదల విస్తరణ 26 శాతం మేర పెరిగినట్టు తెలిపింది. మూలధన వ్యయంలో 30-50 శాతం మేర వ్యయాన్ని నీటి పారుదల రంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించినట్టు వివరించింది. కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల వల్లే రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని నిపుణులు చెప్తున్నారు.
కేసీఆర్ పాలనలో వ్యవసాయ రంగంతో పాటు పరిశ్రామిక రంగంలోనూ తెలంగాణ కొత్త రికార్డులను సృష్టించినట్టు ఐసీఆర్ఏ నివేదిక తెలిపింది. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పారిశ్రామిక రంగంలో తెలంగాణ సమ్మిళిత వార్షిక వృద్ధిరేటు 6-7 శాతంగా నమోదైనట్టు నివేదిక వెల్లడించింది. జాతీయ సగటు 5.7 శాతం కంటే ఇది ఎక్కువ అని వెల్లడించింది. సేవల రంగంలోనూ తెలంగాణ సమ్మిళిత వార్షిక వృద్ధిరేటు 6.5-6.9 శాతంగా నమోదైనట్టు నివేదిక వెల్లడించిం ది. ఈ విషయంలోనూ జాతీయ సగటు కంటే తెలంగాణ చాలా ముందున్నట్టు వివరించింది. వాణిజ్య వి భాగంలో 9 శాతం, రియల్ఎస్టేట్ రంగంలో 8 శాతం, రవాణా రంగంలో 7 శాతం వృద్ధితో తెలంగాణ దేశంలోనే టాప్ ప్లేస్‌లో ఉన్నట్టు నివేదిక వెల్లడించింది.
జీఎస్వీఏలో తెలంగాణ టాప్ ప్లేస్‌లో ఉన్నట్టు ఐసీఆర్ఏ నివేదికతో పాటు ఆర్థిక సర్వే 2024-25 నివేదిక కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ జీఎస్వీఏలో సేవారంగం వాటా 60 శాతానికి పైగా నమోదైనట్టు తెలిపింది. సర్వీసు రంగంలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచినట్టు ఆర్థిక సర్వే 2024-25 నివేదిక వెల్లడించింది. పదేండ్లలో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఐటీ సేవల్లో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు, రియల్ ఎస్టేట్ రంగంలో వృద్ధి.. సేవారంగం విస్తరించడానికి దోహదపడ్డాయని నివేదిక అభిప్రాయపడింది. హైదరాబాద్‌లో కార్యాలయ, నివాస స్థలాలకు మంచి గిరాకీ ఏర్పడినట్టు వివరించింది. ఆర్థిక ప్రగతికి కీలకమైన జీఎస్డీపీ, తలసరి ఆదాయం, విద్యుత్తు, పంటల సాగు, అటవీ విస్తీర్ణంతో పాటు పలు అంశాల్లో కేసీఆర్ హయాంలో తెలంగాణ రికార్డులు సృష్టించిందని ఆర్బీఐ హ్యాండ్‌బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్-2024 నివేదిక స్పష్టంచేసింది.
2014లో రాష్ట్రంగా ఆవిర్భవించిన ఉన్న సమస్యలను తొలి సీఎం కేసీఆర్ పరిష్కరిస్తూ 2024 నాటికి రాష్ర్టాన్ని అగ్రపథాన నిలిపారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ బంగారమయమైంది. ఆర్బీఐ నివేదిక అయినా, ఆర్థిక సర్వే, ఎంఎస్ఎంఈ కౌన్సిల్ ని వేదికలైనా ప్రస్తుత ఐసీఆర్ఏ నివేదిక అయినా ఇదే విషయాన్ని స్పష్టంచేస్తున్నది. కానీ రేవంత్‌రెడ్డి ఏడాదిన్నర పాలనలో పచ్చని తెలంగాణ అస్తవ్యస్తంగా మారిపోయింది. జీఎస్డీపీ వృద్ధిరేటు గతంతో పోలిస్తే, 0.94 శాతం మేర పడిపోయింది. తలసరి ఆదాయం వృద్ధిరేటు గతంతో పోలిస్తే 4.5 శాతం తక్కువగా రికార్డయింది. జీఎస్టీ వసూళ్లు, రవాణా రాబడి కూ డా పడిపోయింది. ఈ మేరకు గత నెలలో విడుదలై న కేంద్ర ప్రభుత్వ ఎంవోఎస్పీఐ నివేదికతో స్పష్టమవుతున్నది.
జీఎస్‌వీఏను సాంకేతికంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో జతచేరిన అదనపు విలువ (గ్రాస్ స్టేట్ వ్యాల్యూయాడెడ్)గా పిలుస్తారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు తదితర రంగాలు ఉత్పత్తి చేసే విలువనే జీఎస్డీపీగా తీసుకొంటాం. రాష్ట్రంలోని ఒక్కో పౌరుడు పనిచేస్తేనే జీఎస్డీపీలో వృద్ధిరేటు సాధ్యపడుతుంది. స్థూలంగా చెప్పాలంటే ఒక్కో పౌరుడి ఉత్పాదకత విలువను తలసరి జీఎస్వీఏగా పరిగణించవచ్చు. ఒకవిధంగా పౌరుడి ఆదాయమే తలసరి జీఎస్వీఏగా చెప్పొచ్చు.