ఖైరతాబాద్, సెప్టెంబర్ 9 : ప్రస్తుతం ఎలివేటర్లపై ఉన్న 18శాతం జీఎస్టీపై పునరాలోచించి దానిని తగ్గించాలని తెలంగాణ ఎలివేటర్ అసోసియేషన్(టీఈఏ) అధ్యక్షుడు చల్లా అవినాశ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. జీఎస్టీని తగ్గిస్తే దేశంలో గృహ నిర్మాణంపై సానుకూల ప్రభావం పడుతుందని తెలిపారు. మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చిన్న, మధ్యతరహా ఎలివేటర్ ఉత్పత్తిదారులు, ఇన్స్టాలర్లు అనేక ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పారు. ఎలివేటర్లు విలాసం కాదని, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, బహుళ అంతస్తుల భవనాల్లో నివసించే కుటుంబాలకు ఇవి అనివార్యమని పేర్కొన్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే నెలకు 5 వేల ఎలివేటర్లు ఏర్పాటవుతున్నట్టు తెలిపారు. ఎక్కువ జీఎస్టీతో గృహనిర్మాణ ప్రాజెక్టుల్లో లిఫ్టులు పెట్టించుకునేందుకు ప్రజలు వెనుకాడుతున్నట్టు పేర్కొన్నారు. సమావేశంలో అసోసియేషన్ జాయింట్ డైరెక్టర్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.