శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 10, 2020 , 05:02:06

కొత్త రాష్ట్రం.. భారీ బాధ్యత!

కొత్త రాష్ట్రం.. భారీ బాధ్యత!
  • పెద్ద రాష్ర్టాలతో అభివృద్ధిలో పోటీ
  • దేశాభివృద్ధిలో తెలంగాణ కీలకపాత్ర
  • ఏటేటా పెరుగుతున్న భాగస్వామ్యం
  • ఆరేండ్లలో 3.95 శాతం నుంచి 4.52 శాతానికి వృద్ధిరేటు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ వయసు చిన్నదైనా భారీ బాధ్యతను నిర్వర్తిస్తున్నది. ఆరేండ్ల క్రితమే ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినప్పటికీ అరవై ఏండ్ల వయసున్న పెద్ద రాష్ర్టాలతో అభివృద్ధిలో పోటీపడుతున్నది. దేశాభివృద్ధిలో భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచుకొంటూ ముందుకుసాగుతున్నది. తెలంగాణ వార్షిక బడ్జెట్‌ ప్రతిపాదన సందర్భంగా ఆదివారం విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వే-2020 గణాంకాలు దీన్ని స్పష్టం చేస్తున్నాయి. 2014 జూన్‌ 2న కొత్త రాష్ట్రంగా అవతరించిన నాటినుంచే తెలంగాణ దూకుడుగా ముందుకుసాగుతున్నది. వాస్తవానికి మనది ధనిక రాష్ట్రం. ఇదే విషయాన్ని ఉద్యమ సారథి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పక్కా లెక్కలతో చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన వెంటనే తెలంగాణ ప్రజలు పాలనాపగ్గాలను ఉద్యమ నేత కేసీఆర్‌కే అప్పగించి రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపే గురుతరబాధ్యతను ఆయన భుజస్కంధాలపై మోపారు. ఈ బాధ్యతను అత్యంత సమర్థంగా నిర్వర్తిస్తున్న సీఎం కేసీఆర్‌.. తెలంగాణలోని ప్రతి వనరును ఒద్దికగా ఒడిసిపట్టుకొని పక్కా ప్రణాళికతో రాష్ర్టాన్ని పకడ్బందీగా ముందుకు నడుపుతున్నారు. ఫలితంగా నేడు తెలంగాణ దేశంలోని అనేక పెద్ద రాష్ర్టాలతో పోటీపడుతూ ఆర్థికాభివృద్ధిలో దూసుకెళ్తున్నది.


కేంద్రం సహకరించకపోయినా..

29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ.. కేంద్రం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లభించకపోయినా దేశాభివృద్ధిలో పెద్ద బాధ్యతనే నిర్వర్తిస్తున్నది. జనాభాతోపాటు వైశాల్యపరంగా తెలంగాణ అనేక రాష్ర్టాల కంటే చిన్నదైనప్పటికీ ఆర్థికాభివృద్ధిలో, స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జీఎస్డీపీ)లో వృద్ధిలో జోరుగా ముందుకుసాగుతున్నది. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో ఎవరికీ తీసిపోని రీతిలో తన భాగస్వామిగా ఉండటం కేవలం తెలంగాణే చెల్లిందని సామాజిక ఆర్థిక సర్వే-2020 గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.


దేశాభివృద్ధికి తనవంతుగా..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు స్థిర ధరల వద్ద దేశ జీడీపీ రూ.98,01,370 కోట్లు. దీనిలో తెలంగాణ వాటా రూ.3,89,957 కోట్లు (3.98 శాతం)గా ఉన్నది. కొత్తలో విద్యుత్‌ రంగంలో అంధకారం నెలకొనడం అన్నిరంగాలపై ప్రభావం చూపింది. ఉద్యోగుల విభజన, ఆర్థికపర అంశాల్లో గందరగోళంతో తెలంగాణ తన కాళ్లపై తాను నిలబడటానికి కొంత సమయం పట్టింది. 2014-15లో రూ.1,05,27,674 కోట్లుగా ఉన్న జీడీపీలో తెలంగాణ వాటా రూ.4,16,332 కోట్లు. వృద్ధిరేటులో పోల్చుకొంటే 2013-14లో జాతీయ సగటు (7.4 శాతం) కంటే తెలంగాణ (6.8 శాతం) స్వల్పంగా వెనుకబడింది. 


ఆగని పరుగులు

సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన వినూత్న చర్యలు, విప్లవాత్మక పథకాలతో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, జీఎస్డీపీ జాతీయ సగటును అధిగమించడంతోపాటు దేశ జీడీపీలో తెలంగాణ తన వాటాను గణనీయంగా పెంచుకొంటూ పలు పెద్ద రాష్ర్టాలకు దీటుగా ముందుకుసాగుతున్నది. స్థిర ధరల వద్ద 2014-15 నాటికి జీడీపీలో 3.95 శాతంగా ఉన్న తెలంగాణ వాటా 2019-20లో 4.52 శాతానికి పెరిగింది. ప్రస్తుత ధరల వద్ద జీడీపీలో తెలంగాణ వాటా 4.76 శాతంగా నమోదవడం గమనార్హం. అంటే గత ఆరేండ్లుగా జీడీపీకి గణనీయ వాటాను అందజేస్తున్న తెలంగాణ అభివృద్ధిలో అనేక రాష్ర్టాలను అధిగమించి పరుగులు తీస్తున్నది. అందుకే దేశంలోని పలు రాష్ర్టాలకు తెలంగాణ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నది.


logo