హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతున్నది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. శనివారం భక్తులు అత్యధికంగా స్వామివారిని దర్శించుకున్నారు. 75,748 మంది స్వామివారిని దర్శించుకోగా, 35,348 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
భక్తులు సమర్పించుకున్న కానుకల రూపేణా టీటీడీకి రూ.3.89 కోట్లు ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. కాగా శ్రీవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతుందని తెలిపారు.
ఆరు కంపార్ట్మెంట్లో భక్తులు స్వామివారి దర్శనానికి ఎదురు చూస్తున్నారు. తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి ప్రకృతి వ్యవసాయంతో పండించిన వంద టన్నుల శనగలు ఏవీ ధర్మారెడ్డి సమక్షంలో అందజేశారు.
గో ఆధారిత వ్యవసాయంతో పండించిన పంటలతో గోవిందుడికి నైవేద్యం సమర్పించాలని ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు దాదాపు 2,500 మంది రైతులు ఎలాంటి రసాయన ఎరువులు, పురుగు మందులు ఉపయోగించకుండా, ప్రకృతి వ్యవసాయంతో పండించిన శనగలను రైతు సాధికార సంస్థ ద్వారా సేకరించి మార్క్ఫెడ్ ద్వారా తమ మిల్లర్లతో టీటీడీ అవసరాలకు అనుగుణంగా రూపొందించి ఇస్తోందని ఏవో ధర్మారెడ్డి తెలిపారు.
ఈ ఏడాది గో ఆధారిత వ్యవసాయంతో పండించిన 2,300 టన్నుల శనగలు అందుతున్నాయన్నారు. ఇప్పటి వరకు 1800 ఎద్దులు, వట్టిపోయిన ఆవులను రైతులకు అందించామని, శ్రీవారి ప్రసాదంగా భావించి వారు పూజలు చేసి పోషించుకుంటున్నారని వివరించారు.