ప్రత్యేక ప్రతినిధి, మే 7 (నమస్తే తెలంగాణ) : ‘మేము బీసీల పక్షపాతం.. దైవభక్తిలో మమ్మల్ని మించిన వాళ్లు లేరు’.. ఇది బీజేపీ నేతలు చెప్పుకొనే మాట! కానీ దేశంలోనే ప్ర సిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర విషయంలో బీజేపీ ప్రవర్తన.. వాళ్ల అసలు రంగును పట్టిస్తున్నది. తెలంగాణకు తలమానికమైన బాసర సరస్వతి ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగేలా ఆంధ్రా నుంచి వచ్చిన స్వామీజీ ప్రవర్తిస్తుంటే.. పరిరక్షించాల్సిన బీజేపీ నేతలు అతడికే కొమ్ముకాస్తున్నారు. ఆ స్వామీజీకి చెందిన ప్రైవేటు వేద పాఠశాలలో ఓ బీసీ విద్యార్థి తీవ్రంగా గాయపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నా, మరో బీసీ విద్యార్థి ప్రాణాలు పోయినా ఆ పార్టీ నేతలు నోరు మెదపడం లేదు. పైగా పోలీసులపైనే ఒత్తిడి తెచ్చి స్వామీజీని వదిలిపెట్టేలా చేశారు. ఈ క్రమంలో పోలీసు ఉన్నతాధికారులు బాహాటంగానే బీజేపీ నేతల తీరుపై అసహనం వ్యక్తం చేస్తుండగా ‘మీరు అమ్మవారి వైపు ఉంటారా? లేక ఆంధ్రా స్వామీజీకే సపోర్ట్ చేస్తరా?’ అని స్థానికులు నిలదీస్తున్నారు. ఇప్పటికైనా బీసీ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
బాధితులు ఏడుస్తున్నా కనికరం లేదా?
చదువుల తల్లి నిలయమైన బాసర, నేడు అరాచక శక్తులకు ఆలవాలంగా మారింది. ఆంధ్రా నుంచి వచ్చిన ఓ వ్యక్తి స్వామిజీ ముసుగులో స్థాపించిన కేంద్రం పలు వివాదాలకు కారణమవుతున్నది. ఆ ఆశ్రమంలో ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు తీవ్ర అనుమానాస్పదంగా మారగా బాసర ప్రతిష్ఠకు భంగం కలిగించాయి. బాసరలోని ‘శ్రీ వేద భారతీ పీఠం’ పాఠశాలలో లోహిత్ అనే విద్యార్థిపై తీవ్ర దాడి, ఇదే ఘటనలో కీలక సాక్ష్యంగా ఉన్న మరో విద్యార్థి మణికంఠ అనుమానాస్పద మృతి రాష్ట్రంలో సంచలనంగా మారాయి. ఇద్దరు అమాయక బీసీ విద్యార్థుల నెత్తుటి ఘోషకు వేద పాఠశాల నిర్వాహకుడు విద్యానందగిరి స్వామీజీయే కారణమని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులే బాహాటంగా చెప్తున్నారు. ‘మా బిడ్డలకు ఈ దుస్థితి పట్టడానికి కారణం ఆయనే’ అంటూ మీడియా ముందుకు వచ్చి మరీ గోడు వెళ్లబోసుకున్నారు. ఇంత జరుగుతున్నా బీజేపీ నాయకులకు కనిపించడం లేదు. బీసీల కోసమే తమ పార్టీ ఉన్నదని చెప్పుకొనే స్థానిక బీజేపీ ప్రజాప్రతినిధులు.. ఇద్దరు బీసీ బిడ్డలకు అన్యాయం జరిగినా నోరు మెదపడం లేదు.
పైగా దైవ భక్తుల్లో తమను మించిన వారు లేరని చెప్పుకొనే ఆ పార్టీ నేతలు బాసర అమ్మవారి ప్రతిష్ఠకే సదరు స్వామీజీ భంగం కలిగిస్తున్నా కిక్కురుమనడం లేదు. క్షేత్రంలో అనాదిగా వస్తున్న హిందూ సంప్రదాయాలు, ఆచారాలను ఆ స్వామీజీ మంట గలుపుతున్నాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని స్థానికులు జిల్లా అధికారులను కలిసి విన్నవిస్తున్నారు. బాసరలో గోదావరి పుష్కర ఘాట్‌ను కబ్జా చేశాడని.. నిత్య హారతి కార్యక్రమాన్ని అడ్డుపెట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్నాడని, ధనార్జనే ధ్యేయంగా పూజలు, హోమాలు చేస్తున్నాడని, చివరికి అమ్మవారి క్షేత్రంలో అనాదిగా వస్తున్న అక్షరాభ్యాసానికి పోటీగా శాస్ర్తాల్లో ఎక్కడా లేని ‘బీజాక్షరాలు’ రాస్తానంటూ వ్యాపారం చేస్తున్నాడని చెప్తున్నారు. బాసర అమ్మవారిని అప్రతిష్ఠ పాలు చేస్తూ.. శాస్ర్తాల్లో లేని విధానాలను ప్రచారం చేస్తూ హిందూత్వ హననానికి పాల్పడుతున్న వ్యక్తికే స్థానిక బీజేపీ నాయకులు మద్దతుగా నిలుస్తుండటంపై మండిపడుతున్నారు.
స్వామీజీని వదిలేయాలని ఫోన్లు
వేద పాఠశాలలో తీవ్రంగా గాయపడిన లోహిత్ కేసు విచారణలో భాగంగా మార్చి 21న నిర్వాహకుడు విద్యానందగిరి స్వామి, ఆశ్రమంలో ఉండే మాతాజీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ రోజు రాత్రి వారిని బాసర పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. విషయం తెలిసి ఒక బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ గంట వ్యవధిలోనే పదిసార్లకు పైగా పోలీసులకు ఫోన్లు చేసినట్టు సమాచారం. ‘స్వామీజీని ఎట్ల అరెస్టు చేస్తరు? ఎందుకు అరెస్టు చేసిండ్రు? కొండముచ్చు దాడి చేస్తే ఆయనేం చేస్తారు? వెంటనే వదిలేయండి’ అని సదరు నేతలు పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. వారి ఒత్తిడి మేరకే వీళ్లను వదిలేయాల్సి వచ్చిందని స్వామీజీ ఆగడాలపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన గ్రామస్థులకు ఓ పోలీసు అధికారి చెప్పారు. ఒత్తిళ్ల కారణంగా ఏమీ చేయలేకపోతున్నామని అసహనం వ్యక్తం చేశారు.
బీజేపీ మద్దతు ఎందుకు?
బాసరలో ఇంత జరుగుతున్నా స్మామీజీకే బీజేపీ నేతలు మద్దతివ్వడం వెనుక మర్మమెంటి? అసలు ఎవరీ స్వామీజీ? ఎక్కడి నుంచి వచ్చారని ఆరా తీస్తే.. ఆయన ఆంధ్రాలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిగా తెలిసింది. కాశీలో విద్యాభ్యాసం చేసే సమయంలోనే ఆయన ప్రవర్తన నచ్చక గురుకులం నుంచి వెళ్లగొట్టారని తెలిసింది. తర్వాత ఉజ్జయినిలో వేదం చదివినట్టు ఓ సర్టిఫికెట్ చూపిస్తున్నారు. తిరుపతిలోని ఓ పీఠంలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టినట్టు సమాచారం. 2007-08 ప్రాంతంలో బాసరకు రావడానికి ముందు ఓ శిష్యుడి ద్వారా అమెరికా వెళ్లారు. అన్ని కులాల వారికీ వేదం నేర్పిస్తానని అక్కడ ప్రచారం చేసినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో స్వదేశానికి వచ్చి నిజామాబాద్ జిల్లాకు ఇదే ప్రతిపాదనతో వెళ్లారు. ఆశించిన ఫలితం రాకున్నా స్థానిక బీజేపీ నాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయాలే పక్కన నిర్మల్ జిల్లాలో బాసరపై దృష్టి సారించేలా చేశాయి. స్వామీజీకి సన్నిహితుడిగా పేరున్న ఓ బీజేపీ లీడర్ ఆయనను బాసరలో వేద పాఠశాల పెట్టాలని సూచించారు. ఆ నాయకుడి ప్రోత్సాహంతో వేద విద్యానందగిరి బాసర అమ్మవారి క్షేత్రానికి వచ్చారు. ఆయన మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ నాయకులతో ఇప్పటికీ టచ్‌లో ఉంటారని తెలిసింది.
అన్ని కులాల వారికి ఉచితంగా వేద విద్య అందిస్తున్నానని ప్రచారం చేసుకుంటూ ఆయా రాష్ర్టాల బీజేపీ నాయకుల ద్వారా తెలంగాణ బీజేపీ నాయకులు, హిందూ సంఘాల నాయకులకు సైతం దగ్గరయ్యారు. బీజేపీలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారు సైతం బాసరకు వచ్చి అతడిని కలుస్తుంటారు. వారితో కలిసి దిగిన ఫొటోలను స్వామీజీ పెద్దపెద్ద ప్రేమ్‌లు కూడా కట్టించి పెట్టుకున్నారు. వివిధ రాష్ర్టాల గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇలా ఎందరో వేద పాఠశాలకు వచ్చి నోటిపై బీజాక్షరాలు రాయించుకున్నట్టు ఫొటోలున్నాయి. అమ్మవారి దర్శనానికి కూడా బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, హిందూ సంఘాల నాయకులను వెంటబెట్టుకొనే వస్తారంటూ ఆలయ అర్చకులు చెప్తున్నారు. గోదావరి హారతి కార్యక్రమంలోనూ బీజేపీ నాయకులు, హిందూ సంఘాల లీడర్లు పాల్గొంటారని తెలిసింది. ఈ క్రమంలో స్థానిక కీలక ప్రజాప్రతినిధి పుష్కర కాలం క్రితమే స్వామీజీ శిష్యుడిగా మారిపోయారని, ఆ లీడర్ కోసం విద్యానందగిరి స్వామి ప్రత్యేకంగా శత్రునాశన హోమం చేశారని వినికిడి. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ సహా అటు నిజామాబాద్ బీజేపీ లీడర్లు ఇప్పటికీ స్వామీజీకి సన్నిహితంగానే ఉంటూ వస్తున్నారు. కాగా బాసరలోని ప్రైవేట్ వేద పాఠశాలలో జరిగిన ఘటనలపై రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సైతం లైట్ తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఇద్దరు బీసీ విద్యార్థులకు జరిగిన అన్యాయంపై.. బాసర క్షేత్రంలో ఆంధ్రా స్వామీజీ చేస్తున్న ఆగడాలపై లోకమంతా కోడై కూస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఎందుకు పట్టించుకోవడం లేదన్నదని ప్రశ్నార్థకంగా మారింది.
హారతి విషయంలోనూ ఎమ్మెల్యే జోక్యం..
లోహిత్‌పై దాడి కేసు విచారణలో స్వామీజీని వదిలేయాలని ఫోన్ చేసిన స్థానిక బీజేపీ ప్రజాప్రతినిధి.. గోదావరి ఘాట్‌లో హారతి విషయంలోనూ ఆలయ ఈవోకు ఫోన్ చేసినట్టు తెలిసింది. లోహిత్‌పై దాడి, మణికంఠ మృతి నేపథ్యంలో పాఠశాల నిర్వాహకులపై ఆరోపణలు వచ్చాయి. అన్నింటికీ నిత్య హారతి కార్యక్రమమే మూలమని స్థానికులు ప్రశ్నించడం మొదలు పెట్టారు. దీంతో గోదావరి హారతిని వేద పాఠశాల తరఫున కాకుండా స్వామీ జీ శిష్యులతో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఆలయ అర్చకులు ప్రతి బుధవారం ఇచ్చే హారతిని గత బుధవారం (ఏప్రిల్ 30) ఎక్కడైతే వేద విద్యానందగిరి స్వామీజీ ఘాట్‌ను ఆక్రమించి షెడ్డు నిర్మించారో అక్కడ నిర్వహించారు. నిత్యహారతి, వేద పాఠశాల కోసం సదరు స్వామీజీ 2019లో దేవాలయ సీజీఎఫ్ ఫండ్స్ నుంచి రూ.10 లక్షలు తీసుకున్నారు.
ఆ డబ్బులతో కబ్జా చేసిన ఘాట్‌లో కొన్ని పనులు చేసి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల సూచనల మేరకు గత బుధవారం ఆలయం తరఫున హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ విషయమై మరునాడు ఉదయయే స్థానిక బీజేపీ నేత నుంచి ఆలయ ఈవోకు ఫోన్ వచ్చింది. ‘ఆ ఘాట్‌లో మీరు హారతి ఎందుకు ఇచ్చారు? అది స్వామీజీ ఘాట్.. అక్కడ మీరు హారతివ్వడానికి వీలులేదు’ అంటూ మరోసారి స్వామీజీ తరఫున ఆయన వకాల్తా పుచ్చుకున్నారు. దీంతో ఆ రోజు రాత్రి గ్రామ కమిటీ కాకుండా వేద పాఠశాల ఆధ్వర్యంలో హారతి ఇచ్చారు. ఇదంతా స్థానిక బీజేపీ నేత అండదండలతోనే జరిగిందని స్థానికులు చెప్తున్నారు. స్వామీజీపై ఈగవాలకుండా చూస్తున్న వారిలో స్థానిక బీజేపీ నేతలతో పాటు విశ్వహిందూ పరిషత్‌లో కీలకంగా పనిచేసిన ఒక సీనియర్ హస్తమూ ఉన్నది.
స్వామీజీని రక్షించేందుకు ఆయన స్వయంగా వచ్చి రాజీ యత్నాలు చేస్తున్నారు. స్థానిక వీహెచ్‌పీ వ్యవహారాల్లో పాత్ర లేకున్న అఖిల భారత స్థాయిలో మాత్రమే బాధ్యత ఉన్న సదరు వ్యక్తికి స్వామీజీ పట్ల అంత ఆసక్తి ఎందుకు? ఇందులో మతలబు ఏమిటన్న చర్చ సాగుతున్నది. వేదం పేరిట విధ్వంసం..వేదాన్ని అడ్డం పెట్టుకొని బాసరలో వేద విద్యానందగిరి స్వామి విధ్వంసం సృష్టిస్తున్నారని, హిందూత్వ పరిరక్షణ పేరుతో సంఘ్ పరివార్ శక్తులను సైతం ఆయన బురిడీ కొట్టిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. చివరికి బాసర అమ్మవారి ఉనికినే దెబ్బతీసే కుట్రలు చేస్తున్నారు. ఈ విషయం బాసర గ్రామస్థులకు, ఆలయ అర్చకులకు అర్థమైనా, హిందూ సంఘాల నాయకులు, బీజేపీ లీడర్లు గ్రహించలేకపోతున్నారు. బాసర అమ్మవారి కంటే.. ఆంధ్రా స్వామీజీయే వారికి ఎక్కువై పోయారు. ఆంధ్రా స్వామీజీ పాఠశాలలో ఇద్దరు బీసీ విద్యార్థులకు అన్యాయం జరిగినా బీజేపీ నేతలు స్వామీజీకే వంతపాడటం ఎంత వరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పార్టీలకు అతీతంగా బాసర అమ్మవారిని కాపాడుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం వేద పాఠశాల విద్యార్థుల ఘటనల్లో సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో స్వామీజీని సపోర్ట్ చేసే బీజేపీ నాయకుల తీరు మారుతుందా? చదువుల తల్లి సరస్వతి వైపు ఉంటారా? లేక అకృత్యాలకు పాల్పడే ఆంధ్రా స్వామీజీ వైపే ఉంటారా? అన్న చర్చ స్థానికంగా నడుస్తున్నది.