సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : అలంకరణలో ఆభరణాలది ప్రత్యేక స్థానం. సీజన్‌తో సంబంధం లేకుండా మగువల మనుసును దోచే ఆభరణాలు అనేకం. చెవి పోగుల నుంచి వడ్డాణం వరకు ప్రతిది ఓ ప్రత్యేకత. ట్రెండ్‌కు తగ్గ జ్యువెల్లరీని పరిచయం చేయడానికి నగరంలో సరికొత్త జ్యువెల్లరీ దుకాణాలు తమ శాఖలను ఏర్పాటు చేస్తున్నాయి. ముఖ ఆకారాన్ని ఆధారం చేసుకుని.. వయస్సును దృష్టిలో ఉంచుకుని..వర్కింగ్‌ను బట్టి, డ్రెస్సును ఆధారంగా చేసుకుని.. ఇలా విభిన్న రకాలుగా జ్యువెల్లరీని మార్కెట్లోకి తీసుకొని రావడానికి కంపెనీలు పోటీ పడుతున్నాయి. వెండి, గోల్డ్, డైమండ్ తదితర ఆభరణాలన్నీ ప్రత్యేక క్రేజ్‌ను సొంతం చేసుకుంటున్నాయి. వీటిని కొనుగోలు చేయడానికి కస్టమర్లు సైతం అమితాసక్తి చూపిస్తున్నారు. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ వేగంగా జ్యువెల్లరీ రంగంలో అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఆభరణాల ఎక్స్పోలకు హైదరాబాద్ వేదికగా నిలుస్తోంది. దేశ, విదేశీ గోల్డ్ అండ్ పెరల్స్ కంపెనీలన్నీ నగర వేదికగా తమ ఉత్పత్తులతో ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేస్తున్నాయి. దేశంలో హైదరాబాద్ మార్కెట్ చాలా గొప్పగా ఉందని అంతర్జాతీయ జ్యువెల్లరీ రంగం నిపుణులు సైతం పేర్కొంటున్నారు. జెమ్స్ అండ్ జ్యువెల్లరీ రంగానికి అనువైన వాతావరణం, ప్రోత్సాహం అందించడానికి హైదరాబాద్ సరైనదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక్కడ తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి కంపెనీలు పోటీ పడుతున్నాయి.
ఆభరణాల్లో బంగారం క్రేజ్ వేరే లెవల్. చిన్న ముక్కుపుడుకైనా బంగారమై ఉండాలని చాలా మంది మహిళలు ఆశపడుతుంటారు. రోజులెన్నీ గడిచినా వన్నె తరగని లోహం బంగారం. దాని విలువ అదే స్థాయిలో ఉంటుంది. ధనికుల నుంచి పేద వారి వరకు బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. బంగారం కొనడం ఒక సెంటిమెంట్‌గా భారతీయ సంస్కృతిలో ఉంది. మహిళలకు కనకంపై ఉండే ఆపేక్షను మాటల్లో వర్ణించలేం. ముఖ్యంగా అక్షయ తృతీయ, ధన త్రయోదశి రోజుల్లో.. పండుగలు, పెండ్లి, వ్రతాలు ఇతర శుభకార్యాలకు బంగారాన్ని కొనడం, ధరించడం ఆనవాయితీగా ఉంటుంది. ధనవంతుల నుంచి పేదల దాకా ఆయా సందర్భాల్లో ఎంతో కొంత బంగారం కొనుగోలు చేస్తుంటారు. పెండ్లి సందర్భాల్లో బంగారం ధర ఎంత అధికంగా ఉన్నా దాన్ని కొనుగోలు చేస్తుంటారు. నగరంలో బంగారు దుకాణాలన్నీ ప్రతిరోజు కస్టమర్లతో సందడిని తలపిస్తుంటాయి. వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఆభరణాల దుకాణాలు పోటాపోటీగా నాణ్యతతో కూడిన పసిడిని అందించడానికి సై అంటున్నాయి. నగరంలో బంగారు దుకాణాలన్నీ పండుగలతో సంబంధం లేకుండా సందడిగా ఉంటాయి. ఇటీవలి కాలంలో బంగారం ధర తగ్గడంతో చాలా మంది నగరవాసులు బంగారం కొనుగోలు చేసి తమకు ఇష్టమైన ఆభరణాలను తయారు చేయించుకుంటున్నారు.
ప్రస్తుతం బోల్డ్, క్లాసిక్ రంగుల మిశ్రమంతో రూపొందించిన ఆభరణాలు, మీనాకారి విడివిడిగా రాళ్లతో తయారుచేసిన ఆభరణాల ట్రెండ్ నడుస్తోంది. వీటితో పాటు డైమండ్, రూబీ లాంటి రంగురాళ్లతో ఆభరణాలు తయారుచేసే క్లాసిక్ డైమండ్ జ్యువెల్లరీ కూడా బాగా ట్రెండ్‌లో ఉంది. రోజ్‌గోల్డ్ కూడా బాగా ప్రాచూర్యంలో ఉందని జ్యువెల్లరీ నిర్వాహకులు రాధిక తెలిపారు. ఇండియన్ స్కిన్టోన్పై బాగా కనిపించేలా రోజ్‌గోల్డ్ ఉంటుంది. ఇప్పుడు దీనిని మగువలు కొనడానికి అమితాసక్తి చూపిస్తున్నారు. బోల్డ్ఎలిగెంట్ చోకర్, ఇయర్ రింగ్స్ ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. ఎప్పుడైన సరే ధరించాలని అనువుగా ఉంటున్న వెరైటీలను ఎంపిక చేసుకుంటున్నారు. ఇక అన్ని రంగుల దుస్తులతో మ్యాచ్ అయ్యేలా ట్రాఫ్డ్, ప్రొటెక్టెడ్ జెమ్ స్టోన్లో రత్నాలు పొదిగిన జ్యువెల్లరీ మార్కెట్లో అందుబాటులో ఉందని నిర్వాహకులు చెప్పారు. ప్రస్తుతం ఫ్లూయిడ్ ఫార్మ్ దుస్తులు ఎక్కువగా ధరిస్తున్నారు. ఇలాంటి స్థితిలో మరింత అందంగా కనిపించడానికి ఫ్లూయిడ్ ఫార్మ్ ఆభరణాలను ఆశ్రయిస్తున్నారు.
ఆభరణాలను డిజైన్ చేసే సమయంలో మూడు విషయాలను దృష్టిలో ఉంచుకుంటారు. ఒకటి సౌందర్యపు విలువ, ధరించడంలో ఉన్న సౌకర్యం, మూడోది తక్కువ ధర. ప్రస్తుతం మహిళలు తక్కువ ధరలో అందమైన డిజైన్లను వెతుకుతున్నారు. అవి అన్ని అవసరాలకు తగ్గట్టుగా ఉండాలని భావిస్తున్నారు. బ్రైడల్ జ్యువెల్లరీలో మహిళలు అన్ని రకాల ఆభరణాలు అంటే పాపిడి బిళ్ల, ముక్కుపోగు, జూకాలు, నెక్లెస్, మీడియం నెక్లెస్, చెవి జూకాలు, చెవిపోగులు, దండె కడియాలు, చేతి వంకీలు, వడ్డాణం, గజ్జెలు, మెట్టెలు లాంటి వాటిపై మనసు పారేసుకుంటున్నారు. ఇక ఆఫీసుకు వెళ్లే మహిళల ఇష్టాలు సాధారణ మహిళలకు భిన్నంగా ఉంటాయి. వాళ్లు ఎక్కువగా చిన్న చెవిపోగులు, చిన్న జూకాలు, నార్మల్ క్లాసిక్ డ్రెస్‌తో పాటు ధరించడానికి ఇష్టపడుతారని ఐటీ ఉద్యోగి రవళి తెలిపారు. వేసుకునే డ్రెస్సులకు మ్యాచ్ అయ్యే ఆభరణాలను కొనుగోలు చేస్తామని చెప్పారు. ఆభరణాలు ట్రెండ్ కంటే కూడా ఎక్కువగా ముఖాన్ని బట్టి ధరిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఓవెల్ ఫేస్‌లో ముఖం ఉన్న మహిళలకు మార్కిజ్ షేప్ చేవి ఆభరణాలు బాగుంటాయి. రౌండ్ షేప్ ఉన్న వాళ్లు జూకాలు ధరిస్తే బాగుంటాయి. స్కేర్ షేప్ ముఖం ఉన్న వాళ్లు జామితీయ ఆకారంలో ఉండే చెవి ఆభరణాలు ధరిస్తే బాగుంటుంది. టీనేజీ అమ్మాయిల్లో చిన్నచిన్న కలర్‌ఫుల్ డెలికేట్ ఆభరణాలు ధరించే ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. ఇప్పుడు నోస్‌పిన్, నోన్ క్లిప్స్లు బాగా ప్రచారంలో ఉన్నాయి. అవి వెస్టర్న్ డ్రెస్సులో బాగా నప్పుతాయి.
జ్యువెల్లరీ వినియోగం లేకుండా ఏ పెండ్లీ లేదు. ఎలాంటి వేడుకలైన మగువలు ఏదో ఒక జ్యువెల్లరీ ధరించాల్సిందే. అందులో ఇప్పుడు బాగా వినియోగంలో కలర్‌ఫుల్ జ్యువెల్లరీ ఉంది. మిడిల్ ఏజ్‌లో ట్రెడిషనల్, ఫైవ్ వర్క్ ఉన్న క్లాసిక్, ఫైన్గోల్డ్ ఆభరణాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వీటితో పాటు జూకాలు, చెవిపోగులు, జాలీవర్క్, డైమండ్లుక్ ఎక్కువ ట్రెండ్‌లో ఉన్నాయి. 50 దాటిన మహిళలకు సింగి లైన్ నెక్లెస్, కుందన్ నెక్లెస్, ఫ్యూర్ డైమండ్ లేదా గోల్డ్ కంకణం లాంటివి బాగా ప్రచారంలో ఉన్నాయి. మార్కెట్లో విభిన్న రకాల జ్యువెల్లరీ అందుబాటులో ఉంది.