హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-3 జనరల్ ర్యాంకింగ్ లిస్టును(జీఆర్ఎల్) టీజీపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. 2.5లక్షలకు పైగా అభ్యర్థుల ర్యాంకులను ప్రకటించింది. జీఆర్ఎల్తోపాటు గ్రూప్-3 పైనల్ కీ, మాస్టర్ ప్రశ్నపత్రాన్ని సైతం కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచింది. 1,388 పోస్టుల భర్తీకి నవంబర్ 17, 18న టీజీపీఎస్సీ రాత పరీక్ష నిర్వహించింది. 5,36,400 మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించగా, 2,67,921 మంది పరీక్షకు హాజరయ్యారు. టాప్-10 ర్యాంకుల్లో 9 ర్యాంకులు పురుషులే సొంతం చేసుకున్నారు. కేవలం 8వ ర్యాంకు మాత్రమే మహిళా అభ్యర్థి కైవసం చేసుకోవడం గమనార్హం. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి వివరాలను వెబ్సైట్లో పొందుపరుస్తామని, వ్యక్తిగతంగా సమాచారమిస్తామని టీజీపీఎస్సీ తెలిపింది. సాంకేతిక సమస్యలుంటే 040-23542185, 23542187 నంబర్లు, helpdesk@tspsc.gov.in. ఈ-మెయిల్‌ను సంప్రదించాలని సూచించింది.
కటాఫ్ ఇలా ఉండే చాన్స్
కటాఫ్‌పై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీసీ క్యాటగిరీలో 270-230 మార్కులు, ఎస్సీ 235-230, ఎస్టీ-230, దివ్యాంగులు-200, ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీలో 230 మార్కుల వరకు కటాఫ్ ఉండొచ్చని పోటీపరీక్షల శిక్షకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జేఎల్, గ్రూప్-2, గ్రూప్-1 ఫలితాలొచ్చా యి. 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (హెచ్‌డబ్ల్యూవో) పోస్టుల ఫలితాలు విడుదలకానున్నాయి. హెచ్డబ్ల్యూవోలో ప్రతిభసాధించిన వారు గ్రూప్-3 పోస్టులను ఎంపికచేసుకునే అవకాశాల్లేవు. దీని ప్రభావం కటాఫ్‌పై పడనున్నది. ఈ నేపథ్యంలో టాప్-10 మార్కులు 320 వరకు ఉన్నా కటాప్ అంతకంటే తగ్గే అవకాశముంటుందని పోటీపరీక్షల శిక్షకులు అంచనా వేస్తున్నారు.