హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): గ్రూప్-2 పరీక్ష మళ్లీ వాయిదా పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించినట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. గ్రూప్- 2 పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 6, 7వ తేదీల్లో నిర్వహించనున్నట్టు వెల్లడించారు. టీఎస్పీఎస్సీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 2, 3వ తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరగాల్సి ఉన్నది. అయితే.. నవంబర్ 3వ తేదీనే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 3వ తేదీ నుంచే అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో గ్రూప్-2 పరీక్ష నిర్వహణ సాధ్యసాధ్యాలపై మంగళవారం కమిషన్ అత్యవసర సమావేశం నిర్వహించింది.
టీఎస్పీఎస్సీ చైర్మన్ బీ జనార్దన్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన సమావేశంలో పరీక్ష నిర్వహణ, పరీక్ష కేంద్రాలు, బందోబస్తు, సిబ్బంది తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రస్థాయిలో ఎంతో కీలకమైన నోటిఫికేషన్ కావడంతో గ్రూప్-2ను పకడ్బందీగా నిర్వహించాలని కమిషన్ ఏకాభిప్రాయానికి వచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో పరీక్ష నిర్వహణకు తలెత్తబోయే ఇబ్బందులు ఏమిటి? పరీక్ష వాయిదా వేస్తే జరుగబోయే పరిణామాలు ఏమిటి? అభ్యర్థులకు మేలు చేసేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? అనే అంశాలపై కమిషన్ ప్రధానంగా చర్చించింది. సిబ్బంది కేటాయింపు కష్టమని కమిషన్‌కు కలెక్టర్లు తెలిపారు. దీంతో ఎన్నికల హడావుడిలో పరీక్ష నిర్వహిస్తే అభ్యర్థులు ఇబ్బందులు పడతారనే భావనకు వచ్చిన కమిషన్.. గ్రూప్-2ను వాయిదా వేయాలని నిర్ణయించింది.
తెలంగాణలో గ్రూప్-2 క్యాటగిరీ కింద 18 విభాగాల్లో 783 ఉద్యోగాల భర్తీకి నిరుడు జనవరి 18న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రస్థాయిలో గ్రూప్-1 తర్వాత ఎంతో కీలకమైనది గ్రూప్-2 కావడంతో అభ్యర్థులు భారీగా పోటీపడ్డారు. అత్యధికంగా 5,51,943 దరఖాస్తులు వచ్చాయి. తొలుత.. ఆగస్టు 29, 30వ తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నట్టు ఫిబ్రవరి 28న కమిషన్ ప్రకటించింది. అదే నెలలో మరికొన్ని పరీక్షలు ఉండటంతో పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులు కోరారు. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో వినతులు సమర్పించారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల కోణంలో ఆలోచించిన రాష్ట్ర ప్రభుత్వం పరీక్షను వాయిదా వేయాలని కమిషన్‌కు సూచించింది.
వేరే పరీక్షలను పరిగణలోకి తీసుకున్న టీఎస్పీఎస్సీ.. గ్రూప్-2ను నవంబర్ 2, 3వ తేదీల్లో నిర్వహించనున్నట్టు వెల్లడించింది. అయితే, ఎన్నికల నోటిఫికేషన్ రావడం, నవంబర్ 3వ తేదీ నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో మరోసారి వాయిదా వేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఎన్నికల ర్యాలీలు, సభలు నిర్వహించే అవకాశం ఉండడం, పోలీస్ సిబ్బందితోపాటు ఇతర అధికారులు ఎన్నికల విధుల్లో ఉండనున్న నేపథ్యంలో అభ్యర్థులు ఇబ్బంది పడే అవకాశం ఉన్నదని భావించిన కమిషన్ గ్రూప్ 2ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. డిసెంబర్లో వేరే పరీక్షలు ఉండటంతో గ్రూప్-2ను వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించాలని నిర్ణయించింది.