Group-1 | హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ) : గ్రూప్ -1లో డీఎస్పీ పోస్టుల భర్తీ అంశం కొత్త మలుపు తిరిగింది. ఒకే నంబర్ గల రెండు హాల్‌టికెట్లు జారీ చేశారంటూ వచ్చిన వార్తలపై టీజీపీఎస్సీ ఎట్టకేలకు స్పందించింది. ఒక అభ్యర్థి ఫేక్ అని.. ఫోర్జరీ హాల్‌టికెట్‌ను సమర్పించారని తేల్చింది. డీఎస్పీ ఉద్యోగం వచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్న దొంత నిశ్రిత అసలు ప్రిలిమ్స్ పాస్ కాలేదని, మెయిన్స్‌కు సెలెక్ట్ కాలేదని టీజీపీఎస్సీ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. 240909088 హాల్‌టికెట్ నంబర్ ఆమెకు చెందినది కాదని ప్రకటించారు.
పైగా డీజీపీ కార్యాలయంలో సదరు అభ్యర్థి సమర్పించిన హాల్‌టికెట్ కూడా నకిలీదని, ఆమె వాదన నిజంకాదని ప్రకటించింది. 240909088 నంబర్ గల హాల్‌టికెట్ యెల్లబోయిన రుచితది మాత్రమేనని కమిషన్ తేల్చింది. ఇద్దరికి ఒకే హాల్‌టికెట్ కేటాయించారంటూ జరుగుతున్న ప్రచారమంతా అబద్ధమని వెల్లడించింది. తప్పుడు ప్రచారం చేసిన అభ్యర్థిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇలాంటి ప్రచారాన్ని అభ్యర్థులు నమ్మవద్దని కోరింది.
అయితే మొత్తం ఈ వ్యవహారంలో అనేక సందేహాలు, ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవానికి గ్రూప్-1 పోస్టులంటే అంటే సివిల్ సర్వీసెస్ తర్వాత అంతటి ప్రాధాన్యత గల పోస్టులు. వాటికి ఎంపికైన వారికి నియామకపత్రాలిచ్చే విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. జాగరూకతతో వ్యవహరించాలి. కానీ ఈ ప్రక్రియలో అనేక లోపాలు చోటుచేసుకున్నట్టు అర్ధమవుతున్నది. వాస్తవానికి టీజీపీఎస్సీ సహా రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ఉద్యోగాలకు ఎంపికైన వారి వివరాలను సంబంధితశాఖలకు పంపిస్తాయి. ఆ తర్వాత ఆయాశాఖలే నియామకపత్రాలు జారీచేస్తాయి. ఈ ప్రక్రియలో కొన్ని శాఖల అధికారులు నిబంధనల ప్రకారం నడుచుకోవడం లేదని, ప్రొసీజరల్ లోపాలు ఉన్నాయని అనేక ఉదాహరణలు వెల్లడిస్తున్నాయి. తాజా ఉదంతంపైనా నిరుద్యోగులు, జేఏసీ నేతలు అనేక సందేహాలను వ్యక్తంచేస్తున్నారు.