DGP Jitender | హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : ‘గ్రూప్-1 అభ్యర్థులు ఇష్టానుసారంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తామంటే.. మేమంతా చూస్తూ ఊరుకోవాలా? అభ్యంతరాలు ఉన్నవాళ్లు సుప్రీం కోర్టుకు వెళ్లకుండా ఆందోళనలు చేస్తే ఎలా?’ అని డీజీపీ జితేందర్ ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుడుతూ గ్రూప్-1 సమస్య కోర్టులో ఉన్నదని, దానిపై ఏమైనా అభ్యంతరాలుంటే సుప్రీం కోర్టుకు వెళ్లాలి గాని రోడ్లపై తిరుగుతూ ఆందోళనలు చేస్తామంటే ఎట్లా? అని అన్నారు.
ప్రజలకు ఇబ్బంది రావొద్దనే లాఠీచార్జి చేయాల్సి వచ్చిందని చెప్పారు. ‘పబ్లిక్ ప్లేసుల్లో ఇలా ఆందోళనలు చేస్తుంటే మేమేం చేయాలో మీరే చెప్పండి’ అంటూ ఉల్టా మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. గ్రూప్-1 పరీక్షలకు పటిష్ట బందోబస్తు నిర్వహించినట్టు చెప్పారు. అవసరమైతే ప్రత్యేక సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తామని తెలిపారు. పరీక్ష నిర్వహణ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఎవరైనా పరీక్షలు అడ్డుకోవాలని చూస్తే.. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలోని ఓ గుడి వద్ద పరిస్థితి అదుపుతప్పడంతోనే లాఠీచార్జి చేసినట్టు చెప్పారు. పోలీసుల అదుపులో మావోయిస్టు సుజాత ఉన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.
నాగర్కర్నూల్ జిల్లాలో ముగ్గురికి శిరోముండనం చేసిన ఘటన తన వరకూ వచ్చిందని, దానిపై విచారణ చే సి, తక్షణం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలా చేయ డం మంచిపద్ధతి కాదని, పోలీసులకు ఇలాంటి చర్యలు చెడ్డపేరు తెస్తాయన్నారు. పంజాగుట్ట పీఎస్లో చోటుచేసుకున్న హోంగార్డు ఆత్మహత్య వివరాలు తన వరకూ రాలేదని డీజీపీ తెలిపారు. పోలీసు ఆరోగ్య భద్రత కార్డుపై వైద్యం అందక ఓ ఏఆర్ ఎస్సై చనిపోయాడని డీజీపీ దృష్టికి తేగా దానిపై విచారిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సి ఉన్నదని, అందుకు పోలీసుశాఖ నుంచి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. ఈ నెల 21న పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు డీజీపీ చెప్పారు.