హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ మోసాలకు బలవుతున్న ప్రతి నిరుద్యోగి తరఫున తాను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసి కొట్లాడతానని గ్రూప్-1 అభ్యర్థి అస్మా స్పష్టంచేశారు. గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు, నిరుద్యోగులకు కాంగ్రెస్ చేసిన మోసానికి నిరసనగా ఆమె శనివారం మొదటి సెట్ నామినేషన్ దాఖలు చే శారు.
నిరుద్యోగుల తరఫున తాను మొదటి నా మినేషన్ వేశానని చివరి తేదీ వరకు మరింత మంది బరిలో నిలుస్తారని ఆమె చెప్పారు. వెయ్యి మంది నిరుద్యోగులతో భారీ ర్యాలీగా వెళ్లి రెండో సెట్ నామినేషన్ కూడా వేస్తామని తెలిపారు. ఆదివారం నుంచి ప్రచారం ప్రారంభించి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి నిరుద్యోగులకు కాంగ్రెస్ చేస్తున్న మోసాలను వివరిస్తానని తెలిపారు. తమ నిరసనతో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని పేర్కొన్నారు.