మానకొండూర్, సెప్టెంబర్ 13 : యూరియాను అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న కరీంనగర్ జిల్లా మానకొండూర్ లోని కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మన గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌రెడ్డి శనివారం సీజ్‌చేశారు. శుక్రవారం అర్ధరాత్రి (టీఎస్ 03 యూసీ 9269) వాహనంలో 50 బస్తాల యూరియా, 50 ఎఫ్-20 ఎరువుల బస్తాలను అనుమతి లేకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాలకు తరలిస్తుండగా పక్కా సమాచారంతో పట్టుకున్నారు.
కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంలో జాప్యం
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : కొత్తగా ఏర్పాటు చేసిన జేఎన్టీయూ కాలేజీల్లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం అటకెక్కింది. సంబంధించిన ఫైల్ సీఎం రేవంత్‌రెడ్డికి పంపించినా ఇంకా ఆమోదం లభించలేదు. బాధిత అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పడంలేదు. జేఎన్టీయూ పాలేరు, మహబూబాబాద్ కాలేజీల్లో 8 డిపార్ట్మెంట్లలో అసిస్టెంట్ కాంట్రాక్ట్ ప్రొఫెసర్ల నియామకానికి 2023లో సెప్టెంబర్ 29న అధికారులు నోటిఫికేషన్ జారీచేశారు. రెండు కాలేజీలకు ఇటీవలే 74 పోస్టులు మంజూరుచేశారు. మంజూరుచేసిన పోస్టుల్లోనైనా ఎంపికైన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించాలని అభ్యర్థులు కోరుతున్నారు.