హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): గోదావరి నదిపై తెలంగాణ నిర్మిస్తున్న సమీకృత సీతారామ- సీతమ్మసాగర్ బహుళార్ధక ప్రాజెక్టుపై ఏపీ, తెలంగాణ రాష్ర్టాలు తమ వాదనలు వినిపించాయి. ఈ ప్రాజెక్టు డీపీఆర్ఫై మంగళవారం హైదరాబాద్లోని జలసౌధలో రెండు రాష్ట్రాలతో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం నిర్వహించింది. అభ్యంతరాలు ఉంటే సీడబ్ల్యూసీ వద్ద పరిషరించుకోవచ్చని సూచించింది. సమగ్ర ప్రాజెక్టు నివేదికపై (డీపీఆర్) తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అభిప్రాయాలను పొందుపర్చుతూ కేంద్ర జల సంఘానికి నివేదిక పంపిస్తామని బోర్డు తెలిపింది. రెండు రాష్ట్రాల మధ్య వాదనలు చోటుచేసుకున్నట్టు తెలిసింది. ప్రాజెక్టుకు సంబంధించి సీడబ్ల్యూసీ ఏపీకి నాలుగుసార్లు లేఖలు రాసింది. అయినా వాళ్లు పట్టించుకోలేదు. తెలంగాణ పూర్తి వివరాలు అందజేసింది. ఏపీ ఇచ్చిన ప్రాజెక్టుల వివరాల మేరకే 531 టీఎంసీలను సీడబ్ల్యూసీ కేటాయించింది. వాస్తవానికి ఏపీ ఇచ్చిన జాబితా, టీఏసీ వివరాల ప్రకారం 518 టీఎంసీలే ఇవ్వాలి. ట్రిబ్యునల్ మేరకు కేటాయింపుల్లో నీటిని వినియోగించుకొనేందుకు మాకు హక్కు ఉన్నది. మీకు అభ్యంత రాలు ఉంటే సీడబ్ల్యూసీ వద్ద తేల్చుకోవాలి’ అని తెలంగాణ పేర్కొన్నది.