TREIRB | హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): ట్రిబ్ నిర్లక్ష్యం, ప్రభుత్వ అలసత్వం వెరసి గురుకుల అభ్యర్థుల పరిస్థితి అయోమయంగా మారింది. ఎవరికి చెప్పుకోవాలో? ఎక్కడ తమ గోడు వెళ్లబోసుకోవాలో తెలియక సతమతం అవుతున్నారు. అసలు ఎందుకు ఉద్యోగానికి ఎంపిక కాలేదో తెలియని స్థితి నెలకొన్నది. దీనికంతటికీ రాత పరీక్ష నిర్వహించిన తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) ఇప్పటివరకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ (జీఆర్ఎల్)ను ప్రకటించకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. దీంతో అభ్యర్థులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో 9 క్యాటగిరీల్లో మొత్తంగా 9,210 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసిన ట్రిబ్.. వీటిలో 8,708 పోస్టులకు ఫలితాలను ప్రకటించింది. 8304 పోస్టులను భర్తీ చేసింది. ఎంపికైన అభ్యర్థులను ఆయా సొసైటీలకు అలాట్ చేస్తూ నియామక పత్రాలను అందజేసింది. ఇది జరిగి మూడు నెలలు దాటినా జీఆర్‌ఎల్‌ను మాత్రం వెల్లడించలేదు. ఈ దశలో తాము ఎక్కడ, ఎలాంటి పొరపాట్లను చేశామో? ఏ కారణంగా ఉద్యోగం దక్కలేదో తెలియక ఎందరో అభ్యర్థులు మథన పడుతున్నారు. జీఆర్‌ఎల్‌ను ప్రకటించాలని ట్రిబ్‌ను కోరుతున్నా, ఎక్కడా, ఎప్పుడు లేనివిధంగా మొత్తం నియామక ప్రక్రియ పూర్తయ్యేవరకూ ప్రకటించబోమని ట్రిబ్ తేల్చి చెబుతున్నది. ఇది అభ్యర్థుల్లో అనుమానాలకు తావిస్తున్నది. గత 2018, 2019లో జీఆర్‌ఎల్‌ను ప్రకటించిన ట్రిబ్ ప్రస్తుత రిక్రూట్మెంట్లో ఎందుకు పాటించడం లేదని అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
వ్యక్తిగత ఐడీలోనూ ట్రిబ్ మార్కులు వెల్లడించకపోవడం గమనార్హం. సాధారణంగా రాతపరీక్షలో అభ్యర్థి ఎన్ని నెగిటివ్ మార్కులు వచ్చాయి? ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చాడు? మొత్తగా వచ్చిన మార్కులెన్ని? ఏ కమ్యూనిటీ, సాధించిన ర్యాంకు ఎంత అనే వివరాలను ఆయా అభ్యర్థుల వ్యక్తిగత ఐడీల్లో ట్రిబ్ గతంలో పొందుపరించింది. కానీ దానికి ఈసారి ట్రిబ్ స్వస్తి పలికింది. ప్రస్తుతం పీజీటీ, పీడీ, లైబ్రేరియన్ పోస్టులకు మినహా మిగ తా పోస్టుల్లో అభ్యర్థులకు ఆ వివరాలను పూర్తిస్థాయిలో వెల్లడించలేదు. డీఎల్ పోస్టులకు పేపర్2 మార్కులను ఇప్పటికీ ప్రకటించలేదు. జేఎల్, పీజీటీ పోస్టులకు పేపర్3 మార్కులను ఐడీల్లో పొందుపరచనేలేదు. టీజీటీకి సంబంధించి 3 పేపర్లకు సంబంధించి ఒక్క పేపర్ మార్కులను కూడా అభ్యర్థుల వ్యక్తిగత ఐడీల్లోనూ కూడా పొందుపరచలేదు.
చాలామంది అభ్యర్థులు తాము ఎందుకు పోస్టుకు ఎంపిక కాలేదో తెలుసుకునేందుకు సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించారు. ఆయా పోస్టులకు సంబంధించి కటాఫ్ మార్కులు? రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎలా పాటించారు? సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో ఏ అంశాలను పరిగణనలోకి తీసుకున్నారనే సమాచారం కోరుతూ ఆర్టీఐకి దరఖాస్తు చేసుకున్నారు. కానీ ట్రిబ్ మాత్రం వారందరికీ ఒకే సమాధానాన్ని ఇటీవల పంపింది. “నియామక ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతున్నది. మీరు అడిగిన సమాచారం ఇవ్వడం ఇప్పటి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక దానిని బోర్డు సైట్లోనే పెడతాం” అంటూ ట్రిబ్ తేల్చి చెప్పింది. దీనిపై అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గురుకుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటన మొదలు ఆ తర్వాత నిర్వహించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్, డెమోల నిర్వహణ.. ఏ ఒక్క అంశంలోనూ పారదర్శకత పాటించలేదని పలువురు అభ్యర్థులు ఆది నుంచీ గగ్గోలు పెడుతున్నారు. కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే వేలాది మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను అర్ధరాత్రి వరకు హడావుడిగా నిర్వహించిందని నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్రమంలో అనేక తప్పులు దొర్లాయని అభ్యర్థులు మండిపడుతున్నారు. నియామక ప్రక్రియపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఇప్పటికే ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్, జేఎల్ బోటనీ, జువాలజీ, టీజీటీ, పీజీటీకి చెందిన అనేక మంది అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించారు. ప్రస్తుతం ఆయా కేసుల విచారణ కొనసాగుతున్నది. జీఆర్‌ఎల్‌ను ప్రకటిస్తే మరిన్ని కేసులు మరింతగా పెరిగే అవకాశముంటుందని, ఈ నేపథ్యంలోనే ట్రిబ్ అందుకు జంకుతున్నదని గురుకుల అభ్యర్థులు వివరిస్తున్నారు. ఇప్పటికైనా గతంలోలా సైట్లో జీఆర్‌ఎల్‌ను, వ్యక్తిగత ఐడీల్లో మార్కులను పొందుపరచి పారదర్శకతను నిరూపించుకోవాలని అభ్యర్థులు ట్రిబ్‌ను డిమాండ్ చేస్తున్నారు.