హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): గ్రేహౌండ్స్ గురువు (94) ఎన్ఎస్ భాటి మంగళవారం కన్నుమూశారు. సహస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) రిటైర్డ్ డీఐజీ అయిన భాటి పోలీసులను యుద్ధ నిపుణులుగా తీర్చి దిద్దారు. ఎస్ఎస్బీలో రిటైర్ అయిన తర్వాత ఎన్టీఆర్ హయాంలో అప్పటి ఐపీఎస్ అధికారి కేఎస్ వ్యాస్ అభ్యర్థన మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చి గ్రేహౌండ్స్ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. పోలీసులకు గెరిల్లా యుద్ధ తంత్రాలు నేర్పారు.
గ్రేహౌండ్స్ గురువుగా ఖ్యాతికెక్కిన భాటిని భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఆయన మృతికి పలువురు ఐపీఎస్ అధికారులు నివాళులు అర్పించారు. ఒక లెజెండ్ ఇక లేరని డీజీపీ అంజనీకుమార్ ట్వీట్ చేశారు. ఆయన ఆవిష్కరణలను తాను చాలా దగ్గరగా చూశానని, అలాంటి యోధులు వందేళ్లకు ఒకరు మాత్రమే పుడతారని కొనియాడారు. భాటి గెరిల్లా యుద్ధ తంత్రాలు తెలిసిన గొప్ప శిక్షకుడు, యోధుడు అని ఐపీఎస్ అధికారి గిరిధర్ రావుల గుర్తు చేసుకున్నారు.