Green Tax | హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): కాలుష్యాన్ని నియంత్రించి, డీజిల్ భారాన్ని తగ్గించుకోవడం లక్ష్యంగా ఆర్టీసీ ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు భారంగా మారుతున్నాయి. పర్యావరణహిత ప్రయాణం పేరుతో ఆర్టీసీ ‘గ్రీన్ ట్యాక్స్’ పేరుతో అదనపు చార్జీలు వసూలు చేస్తున్నది. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.10, ఏసీ బస్సుల్లో రూ.20 వసూలు చేస్తున్నది. అదనపు వసూళ్ల సమాచారం టికెట్‌పై ముద్రించకపోవడంతో ప్రయాణికులు, సిబ్బంది మధ్య తరచుగా గొవడలు జరుగుతున్నాయి. ఇప్పటికే సూపర్ లగ్జరీ బస్సుల్లో వాటర్ బాటిల్ పేరుతో రూ.10 వసూలు చేస్తున్నారు. ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఆర్టీసీ సిబ్బంది.. అడిగితేనే వాటర్ బాటిల్ ఇస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. గతంలో టికెట్‌పై చార్జీలతో పాటు టోల్, సెస్ వివరాలను ఆర్టీసీ ముద్రించేది. కానీ ఇటీవల వాటిని తొలగించింది. దీంతో ఆర్టీసీ అధికారులు ఎప్పుడు ఎందుకు చార్జీలు పెంచుతున్నారో తెలియక ప్రయాణికులు గందగోళానికి గురవుతున్నారు.
కూల్‌గా ఆర్టీసీ వసూల్
రాష్ట్ర వ్యాప్తంగా సిటీలకు 170, జిల్లా కేంద్రాలకు 183 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ నడుపుతున్నది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆరు డిపోలతోపాటు వరంగల్-2, కరీంనగర్-2, నిజామాబాద్-2 డిపోల్లో కూడా ఎలక్ట్రికల్ బస్సులను నడుపుతున్నది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఒలెక్ట్రా, ఢిల్లీకి చెందిన జేబీఎం సంస్థ నుంచి గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు (జీసీసీ) పద్ధతిలో ఆర్టీసీ అద్దెకు తీసుకున్నది. జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ రూట్లలో వీటిని ఎకువగా తిప్పుతున్నది. దీంతో ఇప్పటి వరకు ఈ రూట్లలోని డీజిల్ బస్సులను తగ్గించింది. ప్రయాణికులు వీటిలోనే ప్రయాణించాల్సిన అనివార్యత కల్పించింది. రాష్ట్రంలో ప్రతీ రోజు లక్ష మందికి పైగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు.
వీరిలో ఎక్కువమంది మహిళలు ఉన్నారు. జిల్లాల నుంచి ఎలక్ట్రికల్ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులు లేకపోవడంతో ఉచిత ప్రయాణం వర్తించడం లేదు కాబట్టి తప్పనిసరిగా టికెట్ తీసుకుంటున్నారు. మహాలక్ష్మి పథకంలో భాగమైన ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మెల్లగా తొలగించేందుకే ఈ ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా వరంగల్ నుంచి హైదరాబాద్ ఆర్డినరీ బస్సుల్లో రూ. 150, ఎక్స్‌ప్రెస్‌లో రూ.160, డీలక్స్‌లో రూ.170, సూపర్ లగ్జరీలో 225, ఏసీ గరుడలో రూ.390గా ఉంది. అదే ఎలక్ట్రిక్ బస్సుల్లో అయితే అన్ని సర్వీస్‌లలో రూ.10 చొప్పున అధికంగా వసూలు చేస్తున్నట్టు ప్రయాణికులు చెప్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా టికెట్లు పెంచడమే ప్రభుత్వం, ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల ఉద్దేశమని ఆరోపిస్తున్నారు