హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): ఇంతింతై వటుడింతై అన్నట్టు.. మూడు మొక్కలతో మొదలైన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ (జీఐసీ) కార్యక్రమం ఇప్పుడు మహోద్యమంగా మారింది. బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమ స్ఫూర్తితో రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌కుమార్ ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ను ప్రారంభించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్ డే సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ చాలెంజ్ కింద రిజర్వు ఫారెస్ట్‌లను దత్తత తీసుకున్న మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ అటవీ ప్రాంతాన్ని సంరక్షించాలని గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు శ్రీకారం చుట్టారు.
2018 జూన్ 17న మొదలైన ఈ మహత్తర కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 265 కోట్ల మొక్కలను నాటారు. ఈ మహాయజ్ఞంలో సామాన్యులతోపాటు అనేక మంది సెలబ్రిటీలు పాల్గొని మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రోగ్రాం ‘లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకున్నది. దేశంలో తలపెట్టిన మంచి కార్యక్రమాల్లో భాగంగా గ్రీన్ ఇండియా చాలెంజ్‌పై ఇండియా టుడే ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ఐఆర్సీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సురమా పాధి మొక్క నాటి గ్రీన్ ఇండియా చాలెంజ్ ఏడో విడత కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు.
‘హర హైతో భారా హై- గ్రీన్ ఇండియా చాలెంజ్’ (భూమి పచ్చగా ఉంటే లోకం నిండుగా ఉంటుంది) అనే నినాదంతో మొక్కలు నాటడానికి శ్రీకారం చుట్టారు. రెండోరోజు సోమవారం ఖుర్దా జిల్లా పరిధిలోని కైపాదర్లోని జగన్నాథ్ కాలేజీలో కళాశాల విద్యార్థులు 1500కుపైగా పండ్ల మొకలను నాటారు. 2030 నాటికి ఒడిశాలో కోటి చెట్లను పెంచడమే లక్ష్యం. ఇగ్నయిటింగ్మైండ్స్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రేరణ ఇంటర్నేషనల్ అండ్ అయలిటిక్ ట్రస్ట్ సహకారం అందించాయి.
కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌కుమార్, ఇగ్నయిటింగ్మైండ్స్ సహ వ్యవస్థాపకులు ఎం కరుణాకర్‌రెడ్డి, ఇగ్నైటింగ్ మైండ్స్ ఒడిశా నాయకుడు, ప్రొఫెసర్ ప్రఫుల్ల ధల్, ట్రీమ్యాన్ ఆఫ్ ఒడిశా, గ్రీన్ ఆర్మీ ప్రెసిడెంట్ డాక్టర్ దిలీప్ శ్రీచందన్, రాఘవ సంజీవుల తదితరులు పాల్గొన్నారు.
మీ ఇల్లు, పార్క్, బాల్కనీ లేదా మరేదైనా ప్రదేశంలో మూడు మొక్కలు నాటాలి. వాటితో సెల్ఫీ తీసుకొని ఆ ఫొటోలను 9000365000కు వాట్సాప్ చేయాలి. ఫొటోలను పంపిన వెంటనే మీకు యాప్ డౌన్లోడ్ చేసుకోమని ఒక మెసేజ్ వస్తుంది. దానిని మీరు డౌన్ చేసుకొని మీ సెల్ఫీలను అప్లోడ్ చేయాలి. అంతే..! ఆ ఫొటోలను గ్రీన్ ఇండియా చాలెంజ్ అధికారిక సోషల్ మీడియా పేజీల్లో పోస్టు చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం.. రాబోయే తరాల కోసం ఇప్పుడే మొక్కలు నాటండి. వాటిని సంరక్షించండి. దీంతో పాటు మీ స్నేహితులు, బంధువులు, సన్నిహితులు కూడా మూడు మొక్కలు నాటాలని చాలెంజ్ విసరండి.