హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అమెరికాలో విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇప్పటికే 11 కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెంట్టేందుకు ముందుకొచ్చాయి. తాజాగా హైదరాబాద్‌లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత గ్రీన్ డాటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ఆరమ్ ఈక్విటీ పార్టనర్స్ సంస్థ ప్రకటించింది. ఇందుకోసం దశలవారీగా 400 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.3,350 కోట్ల) పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడించింది.
ఈ సంస్థ చైర్మన్ వెంకట్ బుస్సా శుక్రవారం అమెరికాలో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబుతో సమావేశమై తమ విస్తరణ ప్రణాళికలను వివరించారు. హైదరాబాద్‌లో నెలకొల్పే డాటా సెంటర్‌తో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ సేవల్లో అంతరం తగ్గడంతోపాటు ఈ-సేవ, ఈ-పేమెంట్, ఈ-ఎడ్యుకేషన్ వంటి ప్రభుత్వ సేవలు అందరికీ అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
హైకోర్టులో 101 మంది ఏజీపీల నియామకం
హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : హైకోర్టులో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లను పెద్ద సంఖ్యలో నియమిస్తూ ఏజీ ఏ సుదర్శన్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో గవర్నమెంట్ ప్లీడర్‌కు ఇద్దరు చొప్పున, ముఖ్యమైన శాఖలు నిర్వహించే గవర్నమెంట్ ప్లీడర్లకు మగ్గురు, నలుగురు ఏజీపీలను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.