వేల్పూర్, జూలై 29: ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సూచించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్లాట్ బుకింగ్, లర్నింగ్ లైసెన్స్ అందించే ఆర్టీవో ఎక్స్టెన్షన్ ఆఫీస్‌ను ఆయన శనివారం ప్రారంభించారు. నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్లు, స్లాట్ బుకింగ్ సిస్టమ్, లైసెన్స్ జారీ చేసే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా స్లాట్ బుకింగ్ కోసం వచ్చిన యువకులతో మంత్రి ముచ్చటించారు. నియోజకవర్గంలో త్వరలో పర్మినెంట్ ఆర్టీవో ఎక్స్టెన్షన్ ఆఫీస్ ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. బాల్కొండ నియోజకవర్గ యువత కోసం మంత్రి వేముల సొంత ఖర్చులతో నిర్వహిస్తున్న ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళాకు విశేష స్పందన లభిస్తున్నది. ఇప్పటికే 7 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని మంత్రి వెల్లడించారు. రోజూ 400 నుంచి 500 మందికి లర్నింగ్ లైసెన్స్‌లు జారీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.