హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): జూలై 3న గురుపౌర్ణమి సందర్భంగా టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చిన అరుణాచలం టూర్ ప్యాకేజీకి విశేష స్పందన లభిస్తున్నదని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అరుణాచలానికి ఇప్పటివరకు 15 ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేయగా.. 13 బస్సుల్లో సీట్లన్ని నిండాయని చెప్పారు. మిగిలిన రెండు బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కొనసాగుతున్నదన్నారు. రిజర్వేషన్ కల్పించిన గంటల వ్యవధిలోనే భక్తులు టికెట్లను బుకింగ్ చేసుకుంటున్నారని చెప్పారు. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి 12, వేములవాడ నుంచి 2, మహబూబ్నగర్ నుంచి ఒక బస్సును అరుణాచలానికి ఏర్పాటు చేశామన్నారు. భక్తుల డిమాండ్ దృష్ట్యా మరిన్ని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసేందుకు సంస్థ సిద్ధంగా ఉందని చెప్పారు. అరుణాచలం టూర్ ప్యాకేజీ ముందస్తు రిజర్వేషన్ కోసం టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ www.tsrtconline.inను సంప్రదించవచ్చన్నారు.