Brijesh Kumar Tribunal | హైదరాబాద్, ఫిబ్రవరి19 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు, రాష్ర్టాల సరిహద్దుల్లో వచ్చిన మార్పుల కారణంగా తెలంగాణ ప్రాంతానికి తీరని నష్టం వాటిల్లిందని, బేసిన్లోనే ఉన్నా కృష్ణా జలాలు దక్కకుండా పోయాయని తెలంగాణ వివరించింది. బేసిన్‌లోని రాష్ర్టాలు నీళ్ల కోసం అల్లాడుతుంటే, ఏపీ మాత్రం బేసిన్ అవతలికి 323 టీఎంసీలను మళ్లిస్తున్నదని, ఇది వాంఛనీయం కాదని తేల్చిచెప్పింది. ఈ మేరకు బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు తెలంగాణ తరపు న్యాయవాదులు నివేదించారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సెక్షన్-3 మార్గదర్శకాల మేరకు ఇరు రాష్ర్టాల మధ్య కృష్ణాజలాల పునఃపంపిణీకి సంబంధించి విచారణను బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ బుధవారం ప్రారంభించింది.
కృష్ణా బేసిన్‌కు సంబంధించి చారిత్రక, భౌగోళిక అంశాలను ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్‌కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్ ఎస్ తలపాత్ర తెలుసుకున్నారు. తెలంగాణ సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ ఆయా అంశాలపై ట్రిబ్యునల్‌లో వాదనలను ప్రారంభించారు. కృష్ణా పరీవాహక ప్రాంతం, దాని ఉపవాగుల ప్రాధాన్యతలను వివరించారు. 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణతో రాష్ట్ర సరిహద్దుల్లో వచ్చిన మార్పులను మ్యాప్‌ల సహాయంతో వివరించారు.
అదేవిధంగా తెలంగాణకు సంబంధించి ప్రస్తుతం లిఫ్ట్ ఇరిగేషన్ సీమ్‌ల కింద ప్రతిపాదించిన నీరు, ఆయకట్టుకు వాస్తవానికి తుంగభద్ర డ్యామ్, కృష్ణా నదిపై అప్పర్ కృష్ణా ప్రాజెక్ట్ కాలువలు, భీమా ప్రాజెక్ట్‌ల ద్వారా గ్రావిటీ ద్వారా అందించేందుకు ప్రణాళికలను రూపొందించారని గుర్తుచేశారు. రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఆ ప్రణాళికలను అమలు చేయలేదని, కేవలం నీరు, ఉపాధి, ఆర్థిక విషయాల్లో ఆంధ్ర ప్రాంతానికి అనుకూలంగా వ్యవహరించిందని వివరించారు. దీంతో తెలంగాణకు తీరని నష్టం వాటిల్లిందని తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించిన జలాలు అంతంత మాత్రమేనని వివరించారు.
బేసిన్‌లోని తెలంగాణ ప్రాజెక్టులకు నికర జలాలను కేటాయిస్తే దాదాపు 25 లక్షల కుటుంబాలు, అంటే దాదాపు 80 లక్షల జనాభాకు జీవనోపాధి లభిస్తుందని సీఎస్ వైద్యనాథన్ వివరించారు. అంతర్రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ జల సూత్రాలను వివరించారు. ఏపీలో సాగులో ఉన్న వాస్తవ విస్తీర్ణాన్ని తగ్గించడం తమ ఉద్దేశం కాదని స్పష్టంచేశారు. శాస్త్రీయ పద్ధతులు, నీటిని సమర్ధంగా వినియోగించుకోవడం ద్వారా నీటిని పొదుపు చేయవచ్చని, ఆ పొదుపు జలాలను బేసిన్ ప్రాంతాలకు కేటాయించాలని తెలిపారు. అదేవిధంగా పోలవరం ద్వారా 80 టీఎంసీలు, పట్టిసీమ లిఫ్ట్ ద్వారా సుమారు 100 టీఎంసీలు, చింతలపూడి లిఫ్ట్ ద్వారా 27 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్ బేసిన్ వెలుపలి ప్రాంతాలకు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
75% డిపెండబిలిటీతో పెన్నా బేసిన్లో 98 టీఎంసీలు, గుండ్లకమ్మ సగటు డిపెండబిలిటీతో 195 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఈ నేపథ్యంలో బేసిన్ నుంచి వెలుపలికి ఏపీ మళ్లించే జలాలను తెలంగాణకు కేటాయించాలని తెలంగాణ వాదనలు వినిపించింది. కృష్ణా డెల్టా వ్యవస్థ, నాగార్జునసాగర్ కమాండ్ ఏరియాల తగ్గింపు ఫలితంగా నీటి వినియోగం తగ్గుతుందని కూడా వివరించారు. కాలువ పడవాటి జలాల ద్వారా కృష్ణా డెల్టా వ్యవస్థలో 75 టీఎంసీల అదనపు నీరు ఏపీకి అందుబాటులో ఉంటుందని, దానిలో కొంత భాగాన్ని వినియోగించుకుంటున్నదని, దానిని లెకించాల్సిన అవసరముందన్నారు.
కృష్ణా జలాల్లో దాదాపు 323 టీఎంసీలను ఏపీ బేసిన్ అవతలికి మళ్లిస్తున్నదని, బేసిన్ ప్రాంతాలు నీటి కోసం ఇబ్బంది పడుతున్నాయని వివరించారు. సరఫరా కంటే బేసిన్ డిమాండ్ ఎకువగా ఉన్నప్పుడు, ఇష్టారాజ్యంగా నీటిని వినియోగించుకునేందుకు ఏపీని అనుమతించవద్దని వాదించారు. ట్రిబ్యునల్‌కు గణాంకాలను, మ్యాపులను తెలంగాణ న్యాయవాదులు సమర్పించారు. తెలంగాణ తరపున మోహన్‌కుమార్, సల్లా విజయ్‌కుమార్, వెంకటనారాయణ, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. గురువారం కూడా ట్రిబ్యునల్ విచారణ కొనసాగనున్నది.