తొర్రూరు, డిసెంబర్ 7 : ఓ విద్యార్థి వాటర్ బాటిల్లో గడ్డి మందు వచ్చిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. చర్లపాలెం సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటూ, ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి వాటర్ బాటిల్లోకి గడ్డి మందు రావడంతో విషయాన్ని హాస్టల్ వార్డెన్‌కు తెలిపారు. వార్డెన్ భాసర్ను వివరణ కోరగా.. ఈ ఘటన హాస్టల్లో జరగలేదని, విద్యార్థి పాఠశాలకు వెళ్లిన క్రమంలోని జరిగి ఉంటుందని తెలిపారు. హెచ్ఎం బుచ్చయ్యను వివరణ కోరగా.. విద్యార్థి వాటర్ బాటిల్లో గడ్డిమందు కలవడం వాస్తవమేనని అంగీకరించారు. కొద్దిరోజుల క్రితం పాఠశాల పరిసరాల్లో పిచ్చి మొకలు ఉండడంతో గడ్డి మందు తెప్పించామని, ఆ మందు విద్యార్థి బాటిల్లోకి ఎలా వెళ్లిందో తెలియని చెప్పారు.
హాస్టల్లో కాలం చెల్లిన మందులు..
చెర్లపాలెం సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు కాలం చెల్లిన మందులను వైద్య ఆరోగ్యశాఖ అందించినట్టు హాస్టల్ సిబ్బంది తెలిపారు. తాము ఇటీవలే హాస్టల్లో హెల్త్ క్యాంపు పెట్టి విద్యార్థులకు పరీక్షలు చేసి సరైన మందులే ఇచ్చామని వైద్య సిబ్బంది పేర్కొన్నారు.