మూసీ సుందరీకరణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరిట బాధిత ప్రజలకు గ్రాఫిక్ మాయాజాలం చూపించారు. డీపీఆర్‌ను విడుదల చేయకుండానే ఊరించి ఉసూరు మనిపించారు. ప్రజలు కోల్పోతున్న ఇండ్లు, భూముల వివరాలను చెప్పకుండా ముగించేశారు. పర్యావరణ వేత్తలు, సామాజిక కార్యకర్తలు, మూసీ బాధితుల పక్షాన పోరాటాలు చేస్తున్న నేతలు, మూసీ బాధితులు లేకుండానే పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
-సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ)
సాంకేతిక విశ్లేషణలు, బాధితులతో సంప్రదింపులు లేకుండానే ఫేజ్-2 హోటల్లో కార్పొరేట్ తరహాలో మీటింగులకు ధీటుగా మూసీ డిటైల్డ్స్ ప్రాజెక్ట్ ప్లానింగ్ మీటింగులతో… మసిబూసి మారేడు కాయ చేసిన చందంగా.. సుదూరంలో ఉన్న సియోల్ నది ఫొటోలే ఆధారంగా సాగిన మూసీ పునర్జీవ సమావేశం నిర్జీవంగా మారిపోయింది. పరీవాహక ప్రాంత ప్రజలకు ఉన్న అనుమానాలు, సందేహా లను నివృత్తి చేయకుండా మరింత భయభ్రాంతులకు గురిచేసేలా చేశారు. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా సాగించారు. సమావేశానికి వచ్చిన మంత్రులు సైతం మాట్లాకుండానే సీఎం ప్రసంగంతో మమా అనిపించేశారు.
సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ): ముఖ్యమ్రంతి ప్రసంగంలోనూ బాధిత ప్రజలకు భరోసా కల్పించే ఒక్క మాటా లేకుండా ఎప్పటిలాగానే ఊకదంపుడు ఉపన్యాసం చేశారు. సీఎం, ఎంఆర్డీసీఎల్ చైర్మన్ ప్రసంగాలు ఒకదానికి మరొకటి పొంతన లేకుండా సత్యదూర మాటలతో గారడి చేశారు. అంతర్జాతీయ స్థాయి నిపుణులు, ఆర్కిటెక్టులు, చరిత్రకారులు, అన్ని రంగాల స్టేక్ హోల్డర్లపై జరిగిన ప్రచారం పేలవంగా నిలిచిన సమావేశంలో… మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నర్సింహారెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గంటన్నరలో మూసీ అభివృద్ధిని వివరించారు.
డీపీఆర్ విషయాలు చర్చించకుండా, మాస్టర్ ప్లాన్లను లోతుగా విశ్లేషించకుండానే…. ఐదు జోన్లతో మూసీ ప్రక్షాళన జరుగుతుందనీ, తొలి దశలో రెండు జలాశయాల నుంచి కేవలం 21 కిలోమీటర్ల పరిధిలో చేపట్టే గాంధీ సరోవర్ ప్రాజెక్టుతో ముగిసింది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణలో ప్రతిపక్షాలపై విమర్శలతో ప్రసంగాన్ని మొదలుపెట్టారు. చివరకు ఏ ఒక్క పేదోడి ఇంటిని రోడ్డునపడేయమంటూనే… సియోల్ నది తరహాలో అభివృద్ధి అనివార్యమేనని స్పష్టం చేశారు. సీఎం ప్రసంగంలో మూసీ సుందరీకరణ పేరిట ప్రభుత్వం చేస్తున్న విధ్వంసంపై నిరసన తెలుపుతున్న ప్రజలకు ఈ పీపీటీతో ఒరిగిందేమీ లేదని తేలిపోయింది. దీంతో ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మరింత ఉద్ధృతంగా పోరాడేందుకు బాధిత ప్రజలు సిద్ధమవుతున్నారు.
మూసీ పునరుజ్జీవనాన్ని సియోల్ నది ప్రక్షాళన నమూనా ప్రకారం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదేపదే చెప్తున్నారు. సీఎం చెప్తున్న సియోల్ నమూనాతో పాటు థేమ్స్, సియోల్ నది, సుబిదా, సింగపూర్ రివర్ నదుల సుందరీకరణను పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ఎంఆర్డీసీఎల్ ఛైర్మన్ ప్రక్షాళనకు ముందు, తర్వాతి చిత్రాలను ప్రదర్శించారు. పాత చిత్రంలో బఫర్ జోన్లో పేదల ఇండ్లు, గుడిసెలు ఉన్నాయి. వాటిని కూల్చి సుందరీకరణలో భాగంగా పెద్దపెద్ద కార్పొరేట్ భవనాలను నిర్మించారు. అదే మాడల్‌ను అనుసరించి మూసీని సుందరీకరిస్తామని పీపీటీలో ప్రకటించారు. అంటే మూసీ పక్కన ఉన్న బస్తీలను కూల్చి సియోల్, థేమ్స్ తరహాలోనే కార్పొరేట్ భవనాలను కట్టన్నుట్లు చెప్పకనే చెప్పారు. బస్తీలకు వర్తించే బఫర్ జోన్
కార్పొరేట్ భవనాలకు వర్తించదా? బస్తీలు మునిగిపోతే వాటి స్థానంలో నిర్మించిన కార్పొరేట్ భవనాలు, మాళ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, రెస్టారెంట్లు మునగవా? అంకెల గారడి, గ్రాఫిక్స్ మాయాజాలం తప్పితే సీఎం ఏర్పాటు చేసిన పీపీటీలో ఏమీ లేదని తేలిపోయింది. సీఎం విజన్ అయన చెప్తున్న కమిట్మెంట్ మొత్తం కార్పొరేట్ శక్తులకు బస్తీ ప్రజల స్థలాలను అప్పజెప్పడమేనని తేలిపోయింది.
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు వ్యయంపై కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకో మాట, పూటకో లెక్క చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నది. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ పెద్దలతో పాటు మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దాకా తలోమాట మాట్లాడుతూ ప్రాజెక్టుపై అనేక అనుమానాలు కలిగేలా చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టును పేరును ఇష్టానుసారం మార్చినట్లుగానే దానికి అయ్యే ఖర్చును కూడా ఇష్టానుసారంగా మారుస్తున్నారు.
రోజురోజుకు ఖర్చును వాళ్లకు నచ్చినట్లుగా పెంచుకుంటూ పోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే రూ.50 వేల కోట్లతో మూసీ ప్రక్షాళన చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కొద్దిరోజుల తర్వాత మంత్రి జూపల్లి కృష్ణారావు రూ.75 వేలకోట్లతో మూసీని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. చివరగా మళ్లీ సీఎం రేవంత్‌రెడ్డి రూ.75 వేల కోట్లు కాదు.. మొత్తం వ్యయం రూ.1.5 లక్షల కోట్లతో ప్రపంచం అబ్బురపరిచేలా మూసీని సుందరీకరిస్తామని సెలవిచ్చారు. ఇలా రోజురోజుకు పెంచుకుంటూ పోయారు. అదే తరహాలో మూసీ సుందరీకరణలో భాగంగా బాఫుఘాట్ దగ్గర గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి రూ.5 వేల కోట్లతో గాంధీ సరోవర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
హిమాయత్‌సాగర్ నుంచి బాపుఘాట్ దాకా భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రజలు తమ ఇండ్లు, స్థలాలను ఖాళీ చేయాలని ప్రకటించారు. ఇవన్నీ డీపీఆర్ ఫైనల్ చేయకుండానే చెప్పుకొచ్చారు. తాజాగా ఫేజ్-1 పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ఎంఆర్డీసీఎల్ ఛైర్మన్ గాంధీ సరోవర్‌ను రూ.6.5 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్ల వరకు ఖర్చు చేసి ఏర్పాటు చేస్తామన్నారు. డీపీపీఆర్ విడుదల చేయకముందే ఇన్ని రకాలుగా ప్రాజెక్టు వ్యయాన్ని నచ్చినట్లుగా పొంతన లేకుండా పెంచుకుంటూ పోతున్నారు. ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారు.