హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు చెందిన కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల్లో ఏదైనా ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇదే విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నోసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశారని, అయినా కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు. ఇకపై ఏ ప్రాజెక్టుకూ జాతీయహోదా ఇవ్వబోం అని కేంద్రం గతంలో చేసిన ప్రకటన, తర్వాత మాట మార్చి పోలవరం, కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా ప్రకటించిన అంశానికి సంబంధించిన వార్తా క్లిప్పింగ్‌లను శుక్రవారం ట్విట్టర్లో పోస్ట్ చేసిన కేటీఆర్.. ఇకనైనా కాళేశ్వరం లేదా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఏదైనా ఒకదానికి జాతీయ హోదా ప్రకటించాలని అడిగారు. జాతీయ ప్రాజెక్టులకు సంబంధించిన జల్‌శక్తిశాఖ సెక్రటరీ నేతృత్వంలో ఈ నెల 6న సమావేశం కానున్న హైపవర్ స్టీరింగ్ కమిటీకి ఈ మేరకు ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆది నుంచీ తెలంగాణపై వివక్షను చూపుతున్నది. ఏపీకి వరాలిస్తూ తెలంగాణపై కక్షసాధింపు ధోరణి అవలంబిస్తున్నది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణలోని ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాల్సి ఉన్నది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, బిజినెస్ స్కూల్‌తో పాటు, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీలను మంజూరు చేయాల్సి ఉన్నది. ఇందులో ఏ ఒక్కదాన్నీ కేంద్రం పట్టించుకోలేదు. అదేసమయంలో ఏపీ సర్కారు కోరిన వెంటనే కేంద్రం వరాలను కురిపిస్తున్నది. తెలంగాణ భూభాగం నుంచి అన్యాయంగా ఏడు మండలాలను లాగేసి ఏపీలో కలిపింది. సీలేరు జల విద్యుత్తు ప్లాంట్‌ను అప్పగించింది.