హైదరాబాద్, ఫిబ్రవరి 6(నమస్తే తెలంగాణ): మరికొందరు అర్చక ఉద్యోగులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. దేవాదాయ శాఖలో కారుణ్య నియామకాల ద్వారా పనిచేస్తున్న 122 మంది అర్చక ఉద్యోగులతోపాటు 2014నాటికి తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న మరో 107మందిని క్రమబద్ధీకరించి వారికి కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు ఇచ్చేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ అంగీకరించారు.
అంతేకాకుండా జీవో ప్రకారం 5625 మంది అర్చక ఉద్యోగులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు రావాల్సి ఉండగా, కేవలం 3000 మందికి మాత్రమే ఇస్తున్నట్టు అర్చక ఉద్యోగుల సంఘం పేర్కొంది. మిగిలిన వారికి కూడా వర్తింపజేసేందుకు సానుకూలత వ్యక్తం చేశారని వెల్లడించింది. గురువారం పలువురు అర్చక ఉద్యోగ సంఘం నాయకులు గంగు ఉపేంద్రశర్మ నేతృత్వంలో హైదరాబాద్లోని చేనేత భవన్లో దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శిని కలిసి సమస్యలు వివరించారు. శైలజా రామయ్యర్ సానుకూలంగా స్పందించినట్టు పేర్కొన్నారు.