రోమ్ తగులబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడని విని విస్తుపోయాం! తనకు హిట్లర్ ఆదర్శమని బాహాటంగా ప్రకటించుకున్న రేవంత్.. నీరోనూ హీరోగా భావిస్తున్నట్టున్నది. ఒకవైపు ఎల్ నినో ముంచుకొస్తున్నది. వానల్లేక పంటలు ఎండుతున్నయ్.. ప్రాణహితలో నీళ్లున్నా లిఫ్ట్ చేసి పొలాలకు పారిచ్చే దిక్కులేదు. మరోవైపు గురుకులాల్లో ఫుడ్‌పాయిజన్ ఘటనలు ఆగట్లేదు. రాష్ట్రంలో ఎక్కడోచోట విద్యార్థులు రోడ్డెక్కని రోజు లేదు. విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్.. వాటిపై సీరియస్‌గా సమీక్షించిందీ లేదు. ప్రజాసమస్యలను గాలికొదిలి.. కాలక్షేపం చేస్తున్నారు. మంగళవారం శిల్పకళావేదికలో అర్జెంటీనా-ఈజిప్ట్ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను అర్ధరాత్రి దాకా వీక్షించి వినోదించారు రేవంత్. తాజాగా గురువారం తన మనుమడి కోసం ఇంట్లో పూరీలు చేస్తూ ఆనందించారు. ‘మనుమడు కోరినప్పుడు తాతకు తప్పుతుందా’ అంటూ వీడియోను ట్వీట్ చేసుకుని మరీ ముఖ్యమంత్రి మురిసిపోయారు.
ఇక మంత్రుల సంగతి సరేసరి! కొందరు విందుల్లో, మరికొందరు విహారయాత్రల్లో నిమగ్నమయ్యారు. ఒకాయన ఈత కొడుతుంటే, ఇంకొకాయన దావత్‌లకు తిరుగుతున్నడు. ఇదంతా సంక్షేమమే! ఇదంతా ప్రజాపాలనే! ఇదేమీ తెలియని రైతులు మాత్రం చుక్కనీటి కోసం బిక్కచచ్చి చూస్తున్నరు. చేను తడిపేందుకు తండ్లాడుతున్నరు. బిందెలతో తెచ్చిపోసో, ట్యాంకర్లతో నీళ్లు పారించో నారును కాపాడుకునేందుకు నానా తిప్పలు పడుతున్నరు.

పోలీస్ ఉద్యోగాల భర్తీలో జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ నిరుద్యోగ యువత, పోలీస్ ఉద్యోగార్థులు గురువారం కరీంనగర్‌లోని తెలంగాణచౌక్‌లో భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. పోస్టుల భర్తీలో ప్రభుత్వ జాప్యంతో వేలాదిమంది నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. త్వరలో విడుదల చేయనున్న నియామక నోటిఫికేషన్లో 20 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
– కరీంనగర్ కలెక్టరేట్

ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న వారికి ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలని కాంట్రాక్టు శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులు డిమాండ్ చేశారు. గురువారం కోఠి హెల్త్ క్యాంపస్‌లోని డీఎంఈ కార్యాలయం ఎదుట తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. భారీస్థాయిలో చేరుకున్న కార్మికులతో డీఎంఈ కార్యాలయ ప్రాంగణం నినాదాలతో మారుమోగింది. డీఎంఈ నరేందర్ కుమార్ వచ్చి సమస్యలు పరిష్కరిస్తామని హామీఇచ్చారు.
– హైదరాబాద్/సుల్తాన్‌బజార్

యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ(టీజీపీఈజేఏసీ) ఆధ్వర్యంలో కరీంనగర్ సర్కిల్ కార్యాలయ ఉద్యోగులు రెండో రోజు గురువారం నల్ల బ్యాడ్జీలు ధరించి ఎస్ఈ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
– కరీంనగర్ ముకరంపుర